
పంపా పరవళ్లు
అన్నవరం: రెండ్రోజులుగా భారీ వర్షాలు కురియడంతో అన్నవరంలోని శ్రీపంపాశ్రీ రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపు నీరు వస్తోంది. ఫలితంగా రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం సాయంత్రం వంద అడుగలకు చేరుకుంది. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పంపా క్యాచ్‌మెంట్ ఏరియా అయిన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయ్‌ర్‌లోకి 700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.35 టీఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. పంట కాల్వల ద్వారా 500 క్యూసెక్కులు ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరో వంద క్యూసెక్కుల నీరు బ్యారేజీ గేట్ల లీకేజీ ద్వారా సముద్రానికి వెడుతున్నట్టు తెలిపారు. పంపా నీటిమట్టం ఇంకా పెరిగితే బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఇరిగేషన్ డివిజన్ ఈఈ జీ శేషగిరిరావు తెలిపారు.
వంద అడుగులకు చేరిన నీటిమట్టం