
సుప్రీంకోర్టు స్టే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
బోట్‌క్లబ్: వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం సమాజం స్వాగతిస్తోందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర జోనల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ అన్నారు. ఆయన మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముస్లిం వర్గానికి వక్ఫ్ సీఈవో పదవి ఇవ్వాలని కోర్టు సూచించిందన్నారు. ఈ సవరణ చట్టం ఉభయ సభల్లో ప్రవేశపెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సమాజానికి అండగా ఉండి బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీలందరూ ఓటు వేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసి బిల్లు ఆమోదముద్ర పడే విధంగా సహకరించి ముస్లిం సమాజానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేసులు వేశారన్నారు. దీంతో సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని విచారించి వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చిందన్నారు. ఈ సవరణ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని తద్వారా ముస్లిం సమాజానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశాల్లో భాగంగా ఆస్తి హక్కు పరిరక్షణ, యాధృచ్ఛిక అధికారాల నివారణ, అధికారాల విభజన, ముస్లిమేతర సభ్యత్వం వంటి పలు అంశాలపై స్టే విధించిందన్నారు.. అయితే కొత్త సవరణ చట్టం వక్ఫ్ ఆస్తులను, హక్కులను, బలహీనపరిచే విధంగా ఉంది కనుక వక్ఫ్ సవరణ చట్టం 2025 ను రద్దుచేసి పాత వక్ఫ్ చట్టాన్ని పునరుద్దరించాలని కోరారు.