
పేదల వైద్యానికి ముప్పు
● పీపీపీ కాదు..
ప్రైవేటీకరణకు తాపత్రయం
● 14 ఏళ్లలో ఒక్క కాలేజీ అయినా కట్టారా
● సీఎం చంద్రబాబుపై
జమ్మలమడక ధ్వజం
కాకినాడ రూరల్: పేదల వైద్యానికి ముప్పు తెచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచన ఆక్షేపణీయమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలను మంజూరు చేసి, వాటిలో 6 పూర్తి చేశారని, 11 కళాశాలలను మూడు దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక చేసిందని ఆదివారం ఆమె మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు చూస్తోందని, ప్రైవేటీకరణ నిర్ణయంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు. పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయం అభ్యంతరకరమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్న ప్రభుత్వం నచ్చిన పనులకు రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు పదవీ కాలంలో ఒక్క వైద్య కళాశాల నిర్మించలేదన్నారు. సహకార సంస్థలు, గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వంటి 54 సంస్థలను నిర్వీర్యం చేశారని, ఇప్పడు వైద్య కళాశాలల వంతు వచ్చిందని ఆరోపించారు. పేదల వైద్యానికి ముప్పు తెచ్చే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగమణి డిమాండ్ చేశారు.