
టెన్నికాయిట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక
దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళల జట్టుకు గెడల హేమమాధురి, రాపాక సంస్కృతి, రాపాక సౌరిక, ఎస్‌కే లతిఫా, మిరియాల ప్రియదర్శిణి ఎంపికై నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల జట్టుకు బోయిన చంటిబాబు, గంగుల చంద్ర మహేష్, రాపాక నవీన్, మద్దాల అజయ్, గారపాటి బాబీలను ఎంపిక చేశామన్నారు. వీరు మండపేటలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న జట్లకు రెండు రోజుల పాటు స్థానిక జెడ్పీ హైస్కూల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. క్రీడాకారులకు టెన్నీకాయిట్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గన్నమని హరికృష్ణ, వైస్ చైర్మన్ ఉప్పులూరి రాంబాబు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, దాపర్తి వెంకటేశ్వరరావు, 20 మంది పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు
గండేపల్లి: ప్రయాణికుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలలు జైలు, రూ.1000 జరిమానా విధించారని సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మురారి శివారు పోలవరం కాలువ బ్రిడ్జి సమీపంలో 2020 మే పదో తేదీ ఉదయం 7 గంటలకు లారీ డ్రైవర్ హుస్సేన్ తన లారీని అతి వేగంగా నడిపి ముందు వెళుతున్న మరో లారీనీ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి విజయనగరం వెళ్లేందుకు లారీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గులివిందల సత్యనారాయణ తీవ్రంగా గాయపడగా, పిల్లలు జహ్నవి, పార్థులకు స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తర్వాత రోజు మృతి చెందాడు. అప్పటి ఎస్సై బి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్. దేవీరత్నకుమారి.. డ్రైవర్ హుస్సేన్‌కు పై విధంగా శిక్ష విధించినట్టు తెలియజేశారు.