
ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
రామచంద్రపురం: కె.గంగవరం మండలం అద్దంపల్లి సమీపంలో ఈనెల 3న దారి దోపీడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఎం.వెంకట నారాయణ వెల్లడించారు. పట్టణంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్రాక్షారామకు చెందిన యండమూరి శ్రీనివాస్ ఈ నెల 3న తాను పనిచేస్తున్న నగల దుకాణాన్ని మూసివేసి సుమారు రాత్రి 11 సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అద్దంపల్లి గ్రామం దేవాంగుల శ్మశాన వాటిక సమీపానికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని ఇనుప పైపుతో కొట్టి కళ్లలో కారం చల్లారు. సుమారుగా 10 గ్రాముల పాతబంగారం, సెల్‌ఫోన్ రూ.5 వేలు, షాపునకు సంబంధించిన రశీదులు, స్కూటర్‌తో పాటు సుమారు రూ.78 వేలు విలువైన వస్తువులు దోచుకుపోయారు. దొంగలకు మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ మేరకు ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం ఏరియా బైపాస్ రోడ్డులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తాళ్లరేవు మండలం గాడిమెగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు, సంగాడి రాజు, పత్తిగొంది గ్రామానికి చెందిన కళ్లేపల్లి ప్రసాద్‌గా గుర్తించారు.