అన్నదాత పోరు సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత పోరు సక్సెస్‌

Sep 10 2025 3:35 AM | Updated on Sep 10 2025 3:35 AM

అన్నద

అన్నదాత పోరు సక్సెస్‌

యూరియా కొరత లేదని బాబు ఎలా అంటున్నారు?

ఆందోళన కారులను ఎంత ఎక్కువగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా తిరుగుబాటు వస్తుంది. పోలీసులు రైతు సంఘ నాయకులను, పార్టీ నాయకులను హౌస్‌ అరెస్టు చేయడం, దారి పొడవునా అడ్డుకోవడం అన్యాయం. ఎంత అవరోధం కలిగించినా భారీ ఎత్తున రైతులు తరలి వచ్చారు. యూరియా కొరత లేదని చెబుతున్న ముఖ్యమంత్రి యూరియాపై సమీక్షలు చేయాలని చెప్పడం వింతగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు కౌలుకు చేస్తున్న రైతుకు కూడా కేవలం ఒక బస్తా మాత్రమే యూరియా ఇవ్వడం దారుణం. వైఎస్సార్‌ సీపీ అన్నదాతకు మద్దతు ఇవ్వడంతో కూటమి సర్కార్‌ దిగొచ్చి సోమవారం అత్యవసరంగా కూపన్లు ఇచ్చింది. రైతులు పండిస్తున్న ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల సమస్యలపై చెవిలో శంఖం ఊదినట్లు ప్రతిపక్ష నాయకులు ఊదితేనే గాని ఈ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పేరుకే కూపన్లు ఇచ్చి సగం కూపన్లు తెలుగుతమ్ముళ్లకు దొడ్డిదారిన ఇచ్చేస్తున్నారు. అలా తమ్ముళ్లకు వచ్చిన యూరియాను బస్తాకు రూ.100 నుంచి రూ.200 అదనంగా వేసుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,

జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ, కాకినాడ

ఆంక్షలు అధిగమించిన రైతు ఆగ్రహం

అడుగడుగునా పోలీసుల కట్టడి

పోటెత్తిన రైతులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

కాకినాడ, పెద్దాపురంలో ఆర్డీవోలకు

వినతులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎరువుల కొరతతో రైతులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రైతులకు మద్ధతుగా మంగళవారం వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన అన్నదాత పోరు విజయవంతమైంది. పార్టీ అధిష్టానం పిలుపుతో పార్టీ శ్రేణులు ఒక్కటిగా తరలివచ్చి అడుగడుగునా పోలీసు ఆంక్షలను కూడా అధిగమించి అనుకున్నట్టుగానే కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయల్లో విజ్ఞాపనలు అందచేశారు. జిల్లా అంతటా సెక్షన్‌–30 అమలులో ఉందని సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు సోమవారం నుంచే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు తదితర నేతలకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అటు పెద్దాపురం, ఇటు కాకినాడ ఆర్డీఓ కార్యాయాలకు వెళ్లే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసేసి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

బారికేడ్లతో అడ్డగింపు

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కోఆర్డినేటర్‌లు తోట నరసింహం, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు వెంట రాగా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో కలిసి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వైపు పాదయాత్రగా పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివస్తోన్న జన సమూహాన్ని చూసి అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేతలతో పాటు తరలివచ్చిన రైతులలో ఆగ్రహం కట్టలు తెంచుకుని బారికేడ్లను తోసుకుంటూ ఒకేసారి ఆర్డీఓ కార్యాలయంలో దూసుకుపోయారు. అక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తోన్న ఇనస్పెక్టర్‌లు వైఆర్‌కే శ్రీనివాస్‌, ఏ కృష్ణభగవాన్‌ కార్యాలయ ఆవరణలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబు, తోట, దవులూరి తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ అరికట్టాలని, రైతులకు సకాలంలో అందజేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ నేత ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి బెహరా రాజేశ్వరి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోటరాంజీ, యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, గొల్లు దివానం, గోళ్ల కాంతిసుధాకర్‌, కరణం భాను, నెక్కంటి సాయి, ఒమ్మి రఘురాం, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, లగుడు శ్రీను, పోతల రమణ, రామిశెట్టి లక్ష్మి పాల్గొన్నారు.

30 మందికే అనుమతి

కాకినాడలో రైతుపోరుకు పార్టీ నేతలు, రైతులు పోటెత్తారు. పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడసిటీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన రైతులు వెంట రాగా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కాకినాడకు పోటెత్తారు. కాకినాడ జిల్లా పరిషత్‌ సెంటర్‌ నుంచి కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో బారికేడ్‌లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పిఠాపురం కోఆర్డినేటర్‌ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆద్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు జిల్లా పరిషత్‌ సెంటర్‌కు చేరుకోవడంతో పోలీసులు వారిని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో వంగా గీత జెడ్పీ సెంటర్‌లో పార్టీ శ్రేణులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులను రోడ్డుపాల్జేసిన కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతులకు తక్షణం యూరియా అందజేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. జెడ్పీ సెంటర్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వైపు వెళుతున్న రైతులు, నేతలను కాకినాడ ఎస్‌డీపీఓ (ఏఎస్పీ) మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ పర్యవేక్షణలో ఇనస్పెక్టర్‌లు చైతన్యకృష్ణ, పెద్దిరాజు, నాగదుర్గారావు, మజ్జి అప్పలనాయుడు, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసులు అడ్డుకున్నారు. గీత, ద్వారంపూడి విజ్ఞప్తి మేరకు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు 30 మందికి మాత్రమే అనుమతించారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ మహిళా ప్రతినిధులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జమ్మలమడక నాగమణి, వర్థినీడి సుజాత, పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, రాష్ట్ర కార్యదర్శి కొప్పన శివనాధ్‌, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్‌(బన్నీ), బీసీ సెల్‌ అధ్యక్షుడు అల్లి రాజబాబు, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి చంద్రశేఖర్‌, ఉమ్మడి తూర్పు మైనార్టీ సెల్‌ సమన్వయకర్త అబ్దుల్‌ బషీరుద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు కష్టాలపై చలనం లేని సర్కార్‌

రాష్ట్రంలో నాలుగైదు వారాలుగా యూరియా, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఈ సర్కార్‌కు చలనం లేకుండా పోయింది. వచ్చిన యూరియాను కాస్తా బ్లాక్‌ మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకుంటున్నారు. యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోందని మొత్తుకుంటున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదు . కనీసం ఒక్క బస్తా కావాలన్నా రైతులు గంటల తరబడి క్యూ లో నిలబడే దుస్థితి నెలకొంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క సీజన్‌లోను రైతులు ఎరువుల కోసం ఇలా ఆందోళన చెందిన దాఖలాలు లేవు. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతమైంది. ప్రస్తుతం యూరియా కొరతను నియంత్రించడంతో పాటు బాక్ల్‌ మార్కెట్‌ అరికట్టాలి. సకాలంలో ఎరువులు అందివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు పంటల బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందివ్వాలి.

– వంగా గీత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,

పార్టీ మహిళా విభాగం

అన్నదాత పోరు సక్సెస్‌1
1/2

అన్నదాత పోరు సక్సెస్‌

అన్నదాత పోరు సక్సెస్‌2
2/2

అన్నదాత పోరు సక్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement