
బాలికపై అత్యాచారం చేసిన యువకులను శిక్షించాలి
గోకవరం: బాలికపై అత్యాచారం చేసిన యువకులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ విజృంభణ ఆధ్వర్యంలో మంగళవారం గోకవరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన మాగాపు గాంధీ, టీడీపీ నాయకుడి అన్నయ్య కుమారుడు గునిపే కిరణ్ ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేశారన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంతో, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాలిక, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాలికకు న్యాయం జరగకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.