
ఆలయాల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
కిర్లంపూడి: గొల్లప్రోలు గ్రామానికి చెందిన ముమ్మిడి వీరవెంకట రాజ్యలక్ష్మి చిల్లంగిలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి, అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన భర్త స్వర్గీయ ముమ్మిడి రామాంజనేయులు జ్ఞాపకార్థం పెద్ద కుమారుడు వీరవెంకట సూరిబాబు, గౌరీ పార్వతి, చిన్నకుమారుడు నరసింహమూర్తి, గంగాభవానీ దంపతులతో కలిసి ఆలయాల అభివృద్ధికి విరాళం అందజేసినట్టు తెలిపారు.
డీఎఫ్‌వోగా రామచంద్రరావు
కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో)గా ఎన్.రామచంద్రరావు నియమితులయ్యారు. డిప్యూటీ కంజెర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాలో పనిచేసిన ఆయనను కాకినాడ జిల్లా డీఎఫ్‌వోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ డీఎఫ్‌వోగా కొనసాగుతున్న డి.రవీంద్రనాథ్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు.
ట్రంప్ సుంకాలతో ఆక్వా అతలాకుతలం
అమలాపురం టౌన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో మన రాష్ట్రంలోని ఆక్వా రంగం అతలాకుతలం అవుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 11న విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతు సదస్సుకు జిల్లా నుంచి ఆక్వా రైతులు హాజరు కావాలని కోరారు. స్థానిక ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో మంగళవారం రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఈ విషయంపై సమావేశమయ్యారు. అనంతరం విజయవాడ ఆక్వా రైతు సదస్సుకు హాజరుకావాలంటూ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులను స్వయంగా కలసి మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు ఆక్వా రైతులను సదస్సుకు ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే ఈ సుంకాల విధింపుపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అరుణాచలం యాత్రకు ప్రత్యేక బస్సు
రాజమహేంద్రవరం సిటీ: అరుణాచలం, రామేశ్వరం యాత్రకు రాజమహేంద్రవరం డిపో నుంచి మంగళవారం స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు 30 మంది భక్తులతో బయలుదేరి వెళ్లిందని డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. ఈ యాత్రలో 9 రోజులపాటు కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, కోయంబత్తూర్, కుంభకోణం, చిదంబరం, గురువాయూర్, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూరు వంటి 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి 18వ తేదీ రాజమహేంద్రవరం డిపోకు చేరుకుంటుందన్నారు.
అయినవిల్లికి
రూ.66.68 లక్షల ఆదాయం
అయినవిల్లి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి రూ.66,68,257 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గ భవాని తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చవితి తొమ్మిది రోజుల్లో 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అన్నదాన సత్రంలో 75 వేల మంది స్వామి అన్న ప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.15,16,469 పెరిగినట్టు తెలిపారు. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ, ఆలయ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు.

ఆలయాల అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం