
అభివృద్ధికి బ్రేక్.. ఉపాధికి షాక్
● రాజోలు దీవిలో వంద ఆయిల్, గ్యాస్ బావులు
● ఉత్పత్తులను తరలిస్తున్న ఆయిల్ కంపెనీలు
● స్థానికులకు ప్రాధాన్యం కరవు
● బయటి వారికే పెద్దపీట
● యువతకు కొరవడిన ఉపాధి
మలికిపురం: రాజోలు దీవి నుంచి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలను తరలించుకు పోతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగం తాండవం చేస్తోందన్నారు. నిక్షేపాలు అధికంగా ఉన్న చోట అభివృద్ధిని సాధించాల్సింది పోయి, యువత ఉపాధి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని సుమారు 100 బావుల ద్వారా ప్రతి రోజూ 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, అదే స్థాయిలో చమురు నిక్షేపాలను ఓఎన్జీసీ, గెయిల్ తరలించుకుపోతున్నాయి. కానీ ఈ సంస్థలు ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి చూపడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇక్కడి వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
పరిశ్రమలకు దక్కని ప్రాధాన్యం
రాజోలు దీవిలో గతంలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో తూర్పుపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, అలాగే తూర్పుపాలెంతో పాటు కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వాటికి లోప్రెజర్ గ్యాస్‌ను తక్కువ ధరకు అందించేవారు. భవిష్యత్తులో గ్యాస్ మరింత అందిస్తారని, రాయితీ కూడా వస్తుందని నిర్వాహకులు ఆశించారు. అయితే రానురాను పరిస్థితి దిగజారింది. గ్యాస్ సరఫరాను పెంచలేదు, రాయితీ ఇవ్వలేదు సరికదా, అప్పటి వరకూ సరఫరా చేసిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశాయి. దీంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా పరిశ్రమలను యజమానులు మూసివేశారు. తూర్పుపాలెం ఐస్ ఫ్యాక్టరీతో పాటు, విద్యుత్, స్టీల్ పరిశ్రమలు, కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ మూతబడ్డాయి. దీంతో నిర్వాహకులు రూ.కోట్లు నష్టపోయారు. స్థానిక యువత ఉపాధి లేక సతమతమవుతున్నారు. స్థానిక పరిశ్రమలకు రాయితీలు, గ్యాస్ సరఫరా చేయని ఆయా సంస్థలు.. ఇతర చోట్ల పరిశ్రమలకు ఇవ్వడం దారుణమైన అంశమని స్థానికులు మండిపడుతున్నారు. లోప్రెజర్ గ్యాస్‌ను తక్కువ ధరకు నియోజకవర్గంలో పరిశ్రమలకు అందించని ఒక సంస్థ.. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి శివకోడులోని ఓ బావిని ధారాదత్తం చేయడం గమనించదగ్గ విషయం.
వరస లీకేజీలు
రాజోలు దీవిలో వారానికోసారి గ్యాస్, ఆయిల్ బావులు లీకవుతాయి. ప్రజలు బెంబేలెత్తి, తీవ్ర భయాందోళనలు చెందుతారు. కానీ ఆయా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాయి. శిథిలమైన పైపులైన్లు, బావుల పరికరాలకు మరమ్మతులు చేయపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కనీసం ఓఎన్జీసీ కార్యకలాపాల పనులు, కాంట్రాక్టులు కూడా ఆయా సంస్థలో పరిచయం, పలుకుబడి ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల సంస్థలు, వ్యక్తులకే ఇస్తున్నారనే వాదన ఇక్కడ బలంగా ఉంది.
అనేక నష్టాలు
రాజోలు దీవిలో గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం గుల్లవుతోంది. ఇక్కడి భూసారంతో పాటు పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. అలాగే గ్యాస్‌ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ పైపులైన్ల లీకేజీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయిల్ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

అభివృద్ధికి బ్రేక్.. ఉపాధికి షాక్