
ఆటిజం.. అవగాహనతో దూరం
● బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య
● ప్రతి వంద మందిలో
ఇద్దరికి వచ్చే అవకాశం
● జిల్లాకు నాలుగు ఆటిజం
కేంద్రాలు మంజూరు
రాయవరం: పేరు పెట్టి పిలిచినా పలకక పోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వైపు చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, మిగిలిన చిన్నారులతో కలవక పోవడం వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాలతో మన దేశంలో ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరు ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆటిజం లక్షణాలు ఉన్న చిన్నారులు అధికమయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాల ఆధ్వర్యంలో ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాలో 22 మండలాల్లో ఇప్పటికే 22 భవిత కేంద్రాలు ఉన్నాయి.
వారిలోనూ నైపుణ్యాలు
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలా ఉండమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్నవారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఈ చిన్నారుల్లో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది.
భవిత కేంద్రాల తరహాలో..
జిల్లా పరిధిలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపట్టారు. ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రాల్లో తరహాలోనే ఈ కేంద్రాల్లో ఆటిజం బాధితులకు సేవలు అందిస్తారు. బాధిత చిన్నారులను పూర్వపు స్థితికి తీసుకువచ్చి అందరిలో కలిసేలా చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే వీటికి ప్రత్యేక భవనాలు నిర్మించడంతో పాటు సిబ్బందిని నియమించే అవకాశముంది. ఒక్కో భవనానికి రూ.27.75 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నిధులతో రెండు గదులు నిర్మిస్తారు. ఫిజియోథెరపీ, ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం(బస్టాండ్) ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
మానసిక పరిస్థితి మెరుగు
ప్రస్తుతం భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడే చిన్నారులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు, ఆటిజం బాధితులకు ఒకేచోట సేవలు అందించడం ఇబ్బందిగా మారడంతో ఆటిజంకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీచ్ లాంగ్వేజ్, వ్యక్తిగత ప్రవర్తన, ఆక్యుపేషనల్, మ్యూజిక్ థెరపీ శాసీ్త్రయంగా సాధన చేయించనున్నారు. ప్రాథమిక దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
త్వరలో ఏర్పాటు చేస్తాం
జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే చిన్నారులకు అనువుగా సెంటర్లను ఎంపిక చేయనున్నాం. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తాం.
– జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, అదనపు
ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షా అభియాన్

ఆటిజం.. అవగాహనతో దూరం