
యూరియా...ఏదయ?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సాగు ముందస్తు ప్రణాళికలో వైఫల్యం జిల్లాలో రైతుల కొంప ముంచింది. జిల్లాలో ఏ ప్రాంతంలోనూ బస్తా యూరియా దొరకడం లేదు. వ్యవసాయ శాఖాధికారులను అడుగుతుంటే ర్యాక్‌ల ఇండెంట్‌లు పెట్టారు, రేపు వస్తాయి, మాపు వస్తాయి అంటూ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. జిల్లాలో యూరియా లభ్యతపై అధికారులు చెప్పే లెక్కలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతన కుదరడం లేదు. జులై నెలాఖరున నాట్లు పూర్తి అయిన ఆయకట్టుల్లో ఇప్పటి వరకు రెండో విడత యూరియా వేసిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవానికి ఈ సరికే రెండోసారి యూరియా వేయాల్సి ఉన్నా అందుబాటులో లేక దేవుడిపై భారం వేసి వరి పంట గాలికొదిలేయాల్సి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఏ మండలంలో ఏ ఆయకట్టులో రైతును కదిపినా కొందామంటే యూరియా లేదని ఘొల్లుమంటున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆగస్టు నెల నాటికి జిల్లాలో దాదాపు అన్ని ఆయకట్టుల్లోను వరినాట్లు పూర్తయ్యాయి.
ఒకటి లేక రెండు బస్తాలే
ప్రస్తుతం రైతులు ఎకరాకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా కాంప్లెక్సు ఎరువు వేస్తున్నారు. జులై నెలలో వరినాట్లు వేసిన రైతులు కూడా ప్రస్తుతం రెండవ విడత ఎరువులు వేయాల్సి ఉన్నా ఎరువుల కొరతతో అదను దాటిపోతోందని ఘెల్లుమంటున్నారు. జిల్లా అంతటా యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇతర కాంప్లెక్సు ఎరువులు అవసరానికి మించి ఉన్నాయి. రైతులకు అవసరమైన యూరియా మాత్రం అందుబాటులో లేదు. ప్రభుత్వం కనీసం యూరియా కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశారనే దానితో సంబంధం లేకుండా ఒకటి, రెండు బస్తాలు మించి యూరియా ఇవ్వడంలేదు. ఐదారెకరాలు సాగు చేసిన రైతుకు కూడా ఒకటి, రెండు బస్తాలంటే ఎలా అని రైతు ప్రతినిధులు నిలదీస్తున్నారు.
అధికారుల ‘స్టాక్’ రిప్లై!
జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయాధికారులు ఊరూవాడా ఊదరగొడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాకు కూడా జిల్లాలో ఎక్కడా ఇబ్బంది లేదని అధికారులు చెబుతుంటే ఎక్కడా చూసినా ఒక్క బస్తా మించి యూరియా ఇవ్వలేని దుస్థితిలో వ్యవసాయశాఖ ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 23,360 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటే ఇప్పటి వరకూ 19,046 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో ఏ వ్యవసాయ సబ్ డివిజన్‌లో పరిశీలించినా గడచిన నాలుగైదు రోజులుగా యూరియా స్టాక్ లేదనే సమాధానం ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాక్‌లు బుక్ అయ్యాయి, రెండు, మూడు రోజుల్లో యూరియా వస్తుందని చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
జగ్గంపేట, గండేపల్లి మండలాలకు సంబంధించి సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారానికి కలిపి 900 టన్నుల యూరియా అవసరమని లెక్క లేశారు. ప్రస్తుతం రైతులకు 25 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని చెబుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో 200 టన్నులు వస్తుంది అని అధికారులు చెబుతున్నారు. తుని మండలానికి 1,100 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇప్పటి వరకు 750 మెట్రిక్ టన్నుల యూరియా అందజేశామని అక్కడి వ్యవసాయాధికారి చెబుతున్నారు. మరో వంద మెట్రిక్ టన్నులు శనివారం అందుబాటులోకి వస్తుందంటున్నారు. వ్యవసాయంలో ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి లేకుంటే కోలుకోలేని రీతిలో నష్టపోతామని రైతులు పేర్కొంటున్నారు.
సకాలంలో ఎరువులు వేయకపోయినా చేను దుబ్బు కట్టక, దిగుబడులు తగ్గిపోతాయి. అధికారులు యూరియా కొరత లేదని ప్రకటనలు ఇస్తున్నారే కానీ, వాస్తవానికి యూరియా ఎక్కడా దొరకడం లేదు. వారం రోజుల క్రితంృ కరప మండలం జెడ్.భావారం రైతు సేవా కేంద్రానికి వచ్చిన 225 బస్తాల యూరియా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో దింపించారు. తీరా అక్కడి అధికార పార్టీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా తమ అనుచరులకు ఏకంగా 125 బస్తాలు ఇచ్చేశారు. రైతులు రోడ్డెక్కి గొడవ చేస్తే మిగిలిన 100 బస్తాలు రైతులకు ఇచ్చారు. పిఠాపురం నియోజవర్గం మొత్తానికి 4,175 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికి 3037.55 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మరో 933 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇటీవల గొల్లప్రోలు మండలంలో యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేసినా వ్యవసాయశాఖ స్పందన నామమాత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.
సామర్లకోట సొసైటీ వద్ద ఎరువుల కోసం రైతుల తోపులాట (ఫైల్)
అదను దాటిపోతున్నా అగచాట్లే
కనికరం లేని కూటమి సర్కారు
లెక్కలకు, వాస్తవానికి లేని పొంతన
రేపు మాపు అంటూ తిప్పుతున్న వైనం
గగ్గోలు పెడుతోన్న ఖరీఫ్ రైతు
దారీ తెన్నూలేని పరిస్థితి
యూరియాకు దారీ తెన్నూ లేకుండా ఉంది. ఈ ఖరీఫ్‌లో నేను 18 ఎకరాల సాగు చేస్తున్నాను. కనీసం 18 బస్తాల యూరియా కావాలి. అయితే ఇప్పటి వరకు నా వరకు ఒక్క బస్తా కూడా యూరియా దక్కలేదు. గత్యంతరం లేక లిక్విడ్ యూరియాను కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నా. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. లిక్విడ్ యూరియాపై నమ్మకం లేదు. యూరియా లభించకపోవడంతో దీనిని ఉపయోగిస్తున్నాను. అదను దాటిపోతే యూరియా వేసినా ప్రయోజనం ఉండదు.
– తాటికొండ అచ్చిరాజు, రైతు,
నవర, సామర్లకోట మండలం
అవసరానికి అందకపోతే అనర్థమే
నేను రెండున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు పంటకు యూరియా కనీసం రెండు బస్తాలు కావలసి ఉంది. అయితే యూరియా లభించకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పంట పిలకలు వేసుకునే దశలో ఉంది. ఈ దశలో తప్పనిసరిగా యూరియా వేయవలసి ఉంది. అదను దాటిపోయాక యూరియా వేయడం వల్ల దోమ ఆశించే ప్రమాదం ఉంది. పంటకు కావలసిన యూరియా కోసం డీలర్లను బతిమాలి రూ.263 ఉన్న యూరియా బస్తా రూ.350కు కొనుక్కోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి యూరియా కొరత ఏర్పడలేదు.
– వెలమర్తి శ్రీనివాస్, రైతు, వీకేరాయపురం,
సామర్లకోట మండలం
బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే
కఠిన చర్యలు
జిల్లాలో యూరియా బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనధికారికంగా నిల్వ ఉంచిన వారిపై 6ఏ కేసు నమోదు చేసి 158.8 మెట్రిక్ టన్నులు సీజ్ చేశాం. జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా శనివారం జిల్లాకు రానుంది. వివిధ మండలాలకు ఈ యూరియా పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో యూరియా రైతులకు అందుబాటులో ఉంటుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అనధికారికంగా నిల్వచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– షణ్మోహన్ సగిలి, కలెక్టర్
పంట నష్టపోతాం
నేను ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.50 ఎకరాలు సాగు చేస్తున్నాను. సీజన్ ప్రారంభంలో కాలువలకు సాగునీరు రావడం రెండువారాలు ఆలస్యమైంది. వర్షాలు పడక వరినాట్లు వేయడంలో ఆలస్యమైంది. ప్రారంభంలోనే యూరియా దొరకక డీఏపీ వేశాను. వరినాట్లు వేసి ఐదు వారాలైంది. చేను పిలకలు తొడిగి, దుబ్బు కట్టే దశలో ఉంది. ఇప్పుడు యూరియా, పొటాష్ ఎరువులు వేయాల్సి ఉంది. ప్రైవేటు దుకాణాలలో కానీ, రైతు సేవాకేంద్రాలలో కానీ యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం. అవసరమైనప్పుడే ఎరువులు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నిబస్తాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. వర్షం పడినా, వర్షం నీటిలో ఉండే నత్రజని కొంతవరకు చేనుకు ఉపయోగపడుతుందనుకుంటే, వేసవికాలం మించిన ఎండలు కాస్తుండటంతో చేను ఎదుగుదల ఉండటంలేదు. యూరియా వస్తుందో, లేదోనని భయం వెంటాడుతోంది.
– సొడగం సూరిబాబు, రైతు, అరట్లకట్ట, కరప మండలం
ఒక బస్తా యూరియా
కూడా ఇవ్వలేదు
నాకు మొత్తం 10 ఎకరాల భూమి ఉంది. నాది జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మా భూములకు నీరు వస్తుంది. ప్రస్తుతం అది పనిచేయకపోవడంతో కేవలం వర్షాధారం మీద నాలుగు ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశాం. నాకు మొత్తం 15 బస్తాల యూరియా అవసరం. నాలుగు ఎకరాల వరి పంటకు ఒక బస్తా యూరియా కూడా ఇప్పటి వరకు వేయలేకపోయాను. బయట మార్కెట్లో గాని, రైతు సేవాకేంద్రాల్లో గాని యూరియా దొరకట్లేదు... యూరియా దొరుకుతుందో లేదో అన్న భయం పట్టుకుంది.
– కర్నాకుల వెంకటరావు, రైతు,
కాండ్రేగుల జగ్గంపేట మండలం
ఇబ్బందులు తప్పడం లేదు
ఆరు ఎకరాల వరి సాగు చేస్తున్నాను. చేను మూన తిరిగింది. రెండుసార్లు పిండి వేశాను. ఇంకో పది రోజుల్లో మరోసారి పిండి వేయాల్సి వుంది. పిండికోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత నెల 25న సొసైటీ సిబ్బంది ఊళ్లో పిండి ఇచ్చారు. ఒక ఆధార్‌కి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. పిండి కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
– ఓబిన్ని రామదాసు, తాళ్ళూరు,
గండేపల్లి మండలం.

యూరియా...ఏదయ?

యూరియా...ఏదయ?

యూరియా...ఏదయ?

యూరియా...ఏదయ?

యూరియా...ఏదయ?

యూరియా...ఏదయ?