
11న జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్, పేటీఏం సంస్థలు 220 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్
సమన్లు జారీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ ఎస్టీ కమిషన్ సూచనల మేరకు ఢిల్లీ ఎస్సీఎస్టీ కోర్టుకు ఈ నెల 9వ తేదీన హాజరుకావాలంటూ ఉన్నత విద్య ప్రిన్సిపాల్ కార్యదర్శికి సమన్లు జారీచేసింది. గ్రంథాలయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ హోదా ఇవ్వాలంటూ బీఆర్ దొరస్వామినాయక్ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో దీనిపై స్పందించిన కమిషన్ హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
పీజీఆర్‌ఎస్ అర్జీలను
గడువులోగా పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పీజీఆర్‌ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. కలెక్టర్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్ లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్‌లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 480 అర్జీలు అందాయన్నారు.
తెరచుకున్న సత్యదేవుని
ఆలయ ద్వారాలు
అన్నవరం: చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూత పడిన సత్యదేవుని ఆలయాన్ని సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు, నిత్యకల్యాణం, ఆయుష్య హోమం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, రాత్రి పవళింపుసేవ యథావిధిగా నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు మాత్రమే స్వామివారి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వందలు జరిగాయి.
అప్పనపల్లిలో దర్శనాలు
పునః ప్రారంభం
మామిడికుదురు: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు, నిత్య కై ంకర్యాల అనంతరం భక్తుల దర్శనాలు పునః ప్రారంభించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమం జరిపారు. స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.
బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను
ముట్టడించిన ఆందోళనకారులు
అనపర్తి : మహిళలపై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించకుండా అదుపులోకి తీసుకుని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ ఊలపల్లి గ్రామానికి చెందిన బాధిత వర్గానికి చెందిన వారు సోమవారం భారీగా తరలివచ్చి బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నెల 6న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మరో వర్గానికి చెందిన వారిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు వారిని వదిలేశారని ఆరోపిస్తూ బాధిత వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అనపర్తి సీఐ సుమంత్ ఆందోళనకారులతో చర్చలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.