
సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని పాలన సాగించాలని, చిన్న చిన్న కారణాలతో సిబ్బందితో ఘర్షణ పడవద్దని ఈఓ వీర్ల సుబ్బారావును దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ సోమవారం ఆదేశించారు. దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం, సిబ్బందిని అవమానించేలా ఈఓ మాట్లాడడం వంటి వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో కొందరు సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్‌ఎస్ తీసుకునేందుకు నిర్ణయించడం వంటివి జరిగాయి. ఆ సందర్భంగా గత ఏప్రిల్ 16వ తేదీన సాక్షి దినపత్రికలో ‘చినబాబొచ్చారు బహుపరాక్’ శీర్షికన, అదే నెల 18వ తేదీన ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తలకు స్పందించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈఓ వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్ ఎస్.చంద్రకుమార్‌ను ఆదేశించారు. ఆయన ఏప్రిల్ 27న విచారణ జరిపి తన నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. విచారణలో ఈఓ వ్యవహార శైలిపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమేనని తేలిందని కమిషనర్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. దేవస్థానంలో సిబ్బంది తో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బంది కలుగకుండా సేవలందించడం ఈఓ ప్రథమ కర్తవ్యమని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. సిబ్బందితో వివాదాలు లేకుండా పరిపాలన సాగించాలని ఈఓను ఆదేశించారు.

సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు

సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు