మర్రెడ్డిపై కన్నెర్ర.. | - | Sakshi
Sakshi News home page

మర్రెడ్డిపై కన్నెర్ర..

Sep 4 2025 10:51 AM | Updated on Sep 4 2025 10:51 AM

మర్రె

మర్రెడ్డిపై కన్నెర్ర..

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏ ముహూర్తాన పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారో కాని అప్పటి నుంచి పిఠాపురంలో జనసేన ముఖ్య నేతల మధ్య సెగ రాజుకుంటూనే ఉంది. డిప్యుటీ సీఎం ఎలాగూ ఉండని పిఠాపురంపై పెత్తనం కోసం జనసేనలోని ఒకే సామాజికవర్గం నుంచి రెండు వర్గాలు నువ్వా, నేనా అనే స్థాయిలో కుమ్ములాడుకుంటున్నాయి. రచ్చకెక్కిన వీరి విబేధాలు ఇటీవల పవన్‌ వద్ద పంచాయతీకి వెళ్లాయి. ఒకరి పెత్తనాన్ని మరొకరు ఒకపట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆధిపత్య పోరు చివరకు పిఠాపురంలో పవన్‌ కనుసన్నల్లో అన్నీ తానై ఒంటిచేత్తో చక్రం తిప్పిన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌కు మంగళంపాడే వరకు వెళ్లింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరనేందుకు ఈ రెండు వర్గాల ముఖ్యనేతలే పెద్ద ఉదాహరణగా నేతలు విశ్లేషిస్తున్నారు. పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ తెర వెనుక అన్నీ తానై చక్కబెట్టారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుని పిఠాపురానికి ఎటువంటి సంబంధం లేని ద్వారపూడికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి అప్పగించడంలో తంగెళ్ల పావులు కదిపారు. తొలినాళ్లలో ఈ రెండు గ్రూపులు భాయ్‌భాయ్‌ అంటూ చెట్టాపట్టాలేసుకునే తిరిగాయి. ఎటొచ్చీ తంగెళ్ల ఎంపీ, పవన్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో పిఠాపురంపై పెత్తనం కోసం మర్రెడ్డి, తంగెళ్ల వర్గాల మధ్య అంతర్గత పోరు పలు సందర్భాల్లో రచ్చకెక్కింది.

పిఠాపురం ఇన్‌చార్జిగా మర్రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తొలి నుంచి ఎంపీ వర్గం బాహాటంగానే చెబుతోంది. నియోజకవర్గంలో తన కనుసన్నల్లోనే అంతా జరగాలనే స్థాయికి మర్రెడ్డి వచ్చేశారని పవన్‌ కల్యాణ్‌ వద్ద చెవిలో జోరీగలా పోరుపెడుతూనే వస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మతో మిలాఖత్‌ అయ్యి పార్టీ నేతలను తొక్కేస్తున్నారని రక్తికట్టించే కథ అల్లారని ఎంపీ తంగెళ్ల వర్గం పవన్‌కు చెబుతున్నారు. నియోజకవర్గ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవల పార్టీ నేతలతో పవన్‌ మంగళగిరిలో బేటీ అయ్యారు. నమ్మి బాధ్యతలు అప్పగిస్తే ఇలానే వ్యవహరిస్తారా అంటూ మర్రెడ్డిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారని పార్టీ నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎంపీ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపి మర్రెడ్డికి చెక్‌ పెట్టిందంటున్నారు. మర్రెడ్డి స్థానే నియోజకవర్గంలో పార్టీ నిర్వహణకు ఫైవ్‌ మెన్‌ కమిటీ వేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మర్రెడ్డి ఒక్కరే ఇన్‌చార్జిగా ఉండగా కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్‌లతో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటుచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కమిటీ నియామకం ద్వారా మర్రెడ్డికి నియోజకవర్గ కార్యకలాపాల్లో ప్రాధాన్యం లేకుండా చెక్‌ పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఇక ముందు సమన్వయ కమిటీదే తుది నిర్ణయమని, అధికారులు కూడా కమిటీ సభ్యులు చెప్పే పనులకు ఆమోదం తెలియచేయాలని మౌఖిక ఆదేశాలు కూడా వచ్చాయంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నామినేటెడ్‌ పోస్టులపై మర్రెడ్డి ఇన్‌చార్జిగా నిర్ణయం తీసుకుని ప్రతిపాదించిన వాటిని వెనక్కు తీసుకోవడం ద్వారా మర్రెడ్డికి ప్రాధాన్యం లేదనే విషయం ప్రచారం చేయాలనే యోచనలో ఎంపీ వర్గం పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 8 జనసేన, 4 టీడీపీకి ఇప్పటికే పంపకాలు జరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ ఎక్కడివక్కడే ఆపేయాలని నిర్ణయించారని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పవన్‌ గెలుపు కోసం పనిచేసిన వారిని జనసేనలో కరివేపాకుల్లా వాడుకుని గాలికి వదిలేస్తారని ఇదంతా చూస్తుంటే అర్థమవుతోందని పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ వర్మ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకు పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మను పవన్‌, అతని సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆకాశానికి ఎత్తేసేవారు. ఎన్నికలు పూర్తయ్యి కూటమి గద్దె నెక్కి పవన్‌ ఉప ముఖ్యమంత్రి, నాగబాబు ఎమ్మెల్సీ అయిపోగానే సోదర ద్వయం వర్మను కరివేపాకులా పక్కన పడేశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వర్మకు పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే సరికొత్త ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు 14 నెలల పాటు పార్టీ కోసం పనిచేసిన తమ నేతను కూడా వర్మ మాదిరిగానే కరివేపాకులా తీసిపారేశారని మర్రెడ్డి వెంట తిరిగిన పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్‌ ఇలాకా పిఠాపురం జనసేనలో రాజుకున్న ఈ కుంపటి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

ఆధిపత్య పోరులో

అధికారాలకు కత్తెర

కోటరీలో చక్రం తిప్పిన ఎంపీ వర్గం

ఫైవ్‌మెన్‌ కమిటీతో ఇన్‌చార్జికి చెక్‌

పిఠాపురంలో

పెరుగుతున్న కరివేపాకులు

ఎన్నికలకే పరిమితమైన

వర్మ ప్రాధాన్యం

గద్దెనెక్కాక గమ్మునున్న

పవన్‌ సోదరులు

మర్రెడ్డిపై కన్నెర్ర..1
1/2

మర్రెడ్డిపై కన్నెర్ర..

మర్రెడ్డిపై కన్నెర్ర..2
2/2

మర్రెడ్డిపై కన్నెర్ర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement