
రత్నగిరిపై 30 శాతం భక్తుల అసంతృప్తి
అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అసంతృప్త స్థాయి అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భక్తు సేవలందించడంలో ఆగష్టు నెలలో కూడా దేవస్థానం పాలకవర్గం విఫలమైనట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. ఆగస్టు నెలలో సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల్లో దాదాపు 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జూలై 26 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తులకు అందుతున్న సేవలపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన సర్వేలో శ్రీకాళహస్తి ప్రధమస్థానంలో నిలవగా అన్నవరం దేవస్థానం ఐదో స్థానంలో నిలిచింది. కాగా కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది.
భక్తుల సంతృప్తి శాతం ఇలా..
● సత్యదేవుని దర్శనం విషయంలో జూన్ నెలలో 73 శాతం మంది, జూలై నెలలో 74 శాతం, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
● మౌలిక వసతుల కల్పనలో జూన్‌లో 66 శాతం, జూలైలో 65 శాతం, ఆగస్టులో లో 64.9 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
● స్వామివారి గోదుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్‌లో 77 శాతం, జూలైలో 78 శాతం, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
● పారిశుధ్య చర్యలలో జూన్‌లో 70 శాతం, జూలైలో 68 శాతం, ఆగస్టులో 66.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
దసరా, కార్తికమాసాల నాటికి చక్కదిద్దాలి
ఈ నెల 22 నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. ఆ రోజు నుంచి పది రోజుల పాటు దసరా నవరాత్రులలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే అక్టోబర్ 22 నుంచి కార్తికమాసం రద్దీ ఉంటుంది. ఈ లోపుగా దేవస్థానంలో భక్తుల అసంతృప్తి తగ్గేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
జూలై 26 నుంచి ఆగస్టు 25 వరకు
వాట్సాప్ యాప్, ఐవీఆర్‌ఎస్ సర్వే