
విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం పశ్చిమ రాజగోపురం వద్ద రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విశ్రాంతి షెడ్డుకు బుధవారం భూమిపూజ జరిగింది. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎండీ ఎంవీవీఎస్ కృష్ణంరాజు దంపతులు భూమిపూజ చేశారు. భక్తుల కోసం లారెస్ సంస్థ ఈ షెడ్డు నిర్మిస్తుంది. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చీటీల పేరుతో మోసం
● రూ.2.39 కోట్లు స్వాహా
● ఇద్దరు నిందితుల అరెస్టు
పిఠాపురం: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో రూ.2.39 కోట్లు స్వాహా చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, పిఠాపురానికి చెందిన కొర్ర సత్యనారాయణ, పక్కుర్తి వరహాలరావు, లోకారెడ్డి భాస్కరరావు కలిసి 2014లో శ్రీసత్య శివాని చిట్‌ఫండ్ కంపెనీని పట్టణంలో మొదలుపెట్టారు. వీరు సభ్యులను చేర్చుకుని, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల చీటీలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం చీటీలు పాడుకున్న 94 మందికి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణ అనంతరం, అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ సునంద గతేడాది నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి 94 మందిని బాధితులుగా గుర్తించారు. నిందితులు కొర్ర సత్యనారాయణ, లోకారెడ్డి భాస్కరరావును బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ