భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి.. | - | Sakshi
Sakshi News home page

భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..

Sep 4 2025 10:37 AM | Updated on Sep 4 2025 10:37 AM

భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..

భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..

రెండేళ్ల బిడ్డతో తల్లి ఆత్మహత్య

జూలైలో భర్త బలవన్మరణం

కాకినాడ రూరల్‌: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్‌ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్‌కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్‌(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్‌ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement