
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
ఆలమూరు: లంచం డిమాండ్ చేసినట్టు రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. రైతు నుంచి రూ.28 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన రైతు జి.సుబ్రహ్మణ్యానికి చెందిన 1.37 ఎకరాల భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కె.విమల సరోజినీకుమారి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడగా, రూ.28 వేలకు అంగీకరించారు. దీంతో రైతు ఆ మొత్తం తీసుకువస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం దాడి చేసింది. సబ్ రిజిస్ట్రార్ విమల సరోజినీకుమారి తన కారు డ్రైవర్ దాసరి దుర్గారావుతో కలిసి రైతు నుంచి రూ.28 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, అదనంగా రూ.35 వేల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సీఐలు వాసుకృష్ణ, భాస్కరసతీష్, సిబ్బంది పాల్గొన్నారు.