రిప్‌పాటు ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

రిప్‌పాటు ప్రమాదం!

Sep 1 2025 3:03 AM | Updated on Sep 1 2025 3:03 AM

రిప్‌

రిప్‌పాటు ప్రమాదం!

రిప్‌ కరెంటు అలలు (ఫైల్‌)

పిఠాపురం: గణపతి నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక నిమజ్జనాలే తరవాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ సాగరతీరం నిమజ్జనాలతో హోరెత్తనుంది. గతంలో సంభవించిన ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

చీలిక ప్రవాహాలతో విద్యుదావేశం

సాగరతీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రాకాసి అలులు రిప్‌ కరెంట్‌ (చీలిక ప్రవాహాలు) ఎందరో ప్రాణాలను కాటేస్తున్నాయి. అలల మాటున పొంచి ఉండి ఒక్క సారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెప్ప పాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు అక్టోబర్‌ నెలల మధ్య ఈ రిప్‌ కరెంట్‌ వెలువడే అలులు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో గతంలో సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన రిప్‌ కరెంట్‌తో వచ్చే దుర్ఘటనలను గుర్తుచేస్తోంది.

రిప్‌ కరెంట్‌ అంటే..

బలమైన అలల మధ్య ఇరుకై న ప్రవాహాన్ని రిప్‌ కరెంట్‌ అంటారు. ఇవి మనిషిని ఒక్క సారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్క సారిగా తీరాన్ని తాకినప్పుడు సము ద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహంగా ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా వారు కనురెప్ప కాలంలో కడలిలో కలిసిపోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేరు.

తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్‌ కరెంట్‌ అంటారు. కరెంట్‌ షాక్‌ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే దీనిని రిప్‌ కరెంట్‌ అంటారు. ఎక్కువగా రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కు ప్రాంతాల్లో ఉప్పుటేరులు, కాలువలు కలిసే చోట్లు ఎన్నో ఉన్నాయి. వాటి దగ్గర ఇవి అనుకోకుండా ఏర్పడుతుంటాయి. రిప్‌ కరెంట్‌ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసేంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో సుమారు 370 మంది వరకు ఈ ప్రమాదానికి గురై మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రిప్‌ కరెంట్‌ను కనుగొనడానికి ఆంధ్రా యూనివర్సిటీ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్‌ కరెంట్‌ ఎక్కడ ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు.

ఆదమరపు వద్దు

గతంలో ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్‌ కరెంట్‌ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి, అటు నుంచి ఒకే సారి కెరటాలు వచ్చి పరస్పరం ఢీ కొనడం వల్ల రిప్‌ కరెంట్‌ (స్క్వేర్‌ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన వారు విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఒక్క సారిగా పెరగడంతో రెండూ కలిసి రిప్‌ కరెంట్‌గా మారి ప్రాణాలను తీసేసే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అక్కడ నిమజ్జనాలను అనుమతి లేదని పోలీసులు ప్రకటిస్తున్నారు.

జిల్లాలో నిమజ్జన ప్రాంతాలివే

జిల్లాలో కాకినాడ బీచ్‌, ఉప్పాడ సాగరతీరం, పీబీసీ, ఏలేరు, సామర్లకోట, గోదావరి కాలువల్లో నిమజ్జనాలు నిర్వహిస్తుంటారు. ఎక్కువగా కాకినాడ బీచ్‌, ఉప్పాడ సాగరతీరంలో వందల విగ్రహాలు నిమజ్జనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 7వ తేదీన చంద్ర గ్రహణం ఉండడంతో తొమ్మిది రోజులు పూర్తి కాగానే అన్ని విగ్రహాల నిమజ్జనాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వందల విగ్రహాలు ఒకే సారి తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉప్పాడ తీర ప్రాంతంలో వినాయక విగ్రహాల

నిమజ్జనాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్‌

కడలి కెరటాల్లో పొంచి ఉన్న కరెంట్‌

అలలతో ఆటలాడితే ప్రాణాపాయమే

వినాయక నిమజ్జనాల వేళ అప్రమత్తం

గతంలో ముగ్గురు యువకుల మృతి

ఏలేరు, పీబీసీ కాలువల్లోనూ ప్రమాదాలు

ఈ ఏడాది ప్రత్యేక రక్షణ చర్యలు

తీసుకుంటున్న అధికారులు

గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో

నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ

ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం

ఉప్పాడ హార్బర్‌ నిర్మాణ ప్రాంతానికి అనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించాం. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. అక్కడ ఈ ఏడాది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఉప్పుటేరులు సముద్రంలో కలిసే చోట అలలు తక్కువగా ఉన్నా క్షణాల్లో ప్రమాదకరంగా మారుతుంటాయి. అందుకే కాకినాడ శివారు లైట్‌హౌస్‌ నుంచి కొత్తపల్లి మండలం కోనపాపపేట వరకు ఉన్న ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. మూలపేట, సుబ్బంపేటల్లో నిమజ్జనానికి ప్రాంతాలను సిద్ధం చేసాం అక్కడే నిమజ్జనాలు చేయాలి.

– జి శ్రీనివాస్‌, సీఐ, పిఠాపురం

రిప్‌పాటు ప్రమాదం!1
1/3

రిప్‌పాటు ప్రమాదం!

రిప్‌పాటు ప్రమాదం!2
2/3

రిప్‌పాటు ప్రమాదం!

రిప్‌పాటు ప్రమాదం!3
3/3

రిప్‌పాటు ప్రమాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement