
ఆగని జలగాటం..
● లంకల్లోకి మళ్లీ నీళ్లు
● నీట మునిగిన కాజ్‌వేలు, పంటలు
● పడవలపైనే రాకపోకలు
సాక్షి, అమలాపురం: గోదావరి వరద వదలనంటోంది.. జిల్లాలో లంక ప్రాంతాలను మళ్లీ ముంచెత్తుతోంది.. కాస్త తగ్గిందనుకునే లోపే తిరిగి ఉధృతంగా మారుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, లంక గ్రామాల్లో ఇప్పటికే కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాల రోడ్లపైకి ముంపునీరు చేరింది. దీంతో లంక వాసులు ప్రత్యామ్నాయ విధానాల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సోమవారానికి ముంపు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది.
ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ప్రభావం పెరుగుతుండడంతో దిగువకు జలాల విడుదల ఆదివారం మరింత పెరిగింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. ఉదయం ఆరు గంటలకు 10,81,115 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, తొమ్మిది గంటలకు 10,94,575 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12 గంటలకు 11,16,464 క్యూసెక్కులు, మూడు గంటలకు 11,24,472 క్యూసెక్కులు, సాయంత్రం ఆరు గంటలకు 11,35,249 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి వరద నిలకడగా ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో దిగువన కూడా వరద తగ్గుతోంది. ఎగువన తగ్గుతున్నా దిగువన లంకల్లో మాత్రం వరద ముంపు పెరుగుతోంది. జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సోమవారం నుంచి వరద ప్రభావం పెరగనుంది.
ఎక్కడెక్కడ ఎలా అంటే..
● మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే నీట మునిగింది. దీనిపై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాజ్‌వే మీదుగా రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. లంక వాసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
● పి.గన్నవరంలో వరద ఉధృతి మరింత పెరిగింది. తాజాగా మానేపల్లి నుంచి శివాయలంకకు వెళ్లే రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నీట మునిగింది. తాము రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రాక్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనకాయలంక కాజ్‌వే మరింత ముంపు బారిన పడింది.
● అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడెం కాజ్‌వే నీట మునిగింది. దీంతో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక వాసులు పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాడి రైతులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని లంక పొలాల్లోకి వరద నీరు చేరింది.
● ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్‌తో పాటు, రాఘవేంద్ర వారధి, ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎదుర్లంక, జి.మూలపొలం, గుత్తెనదీవిల వద్ద ఏటిగట్టు దిగువన ఉన్న లంకల్లోకి వరద చొచ్చుకు వస్తోంది. దిగువన లంకల్లో నీరు ప్రవహిస్తోంది.
● ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంకల్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. గురజాపులంకకు వెళ్లే రహదారి నీట మునగనుంది. కాట్రేనికో న మండలం పల్లంకుర్రు రేవు, భైరవపాలెం లంకల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వస్తోంది.
నేడు పాఠశాలలకు సెలవు
పి.గన్నవరం: వరదల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు ఎంఈఓ కోన హెలీనా తెలిపారు. అలాగే పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాలతో పాటు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వస్తున్న 327 మంది విద్యార్థులకు కూడా సెలవు ఇచ్చారన్నారు. లంక గ్రామాల నుంచి విద్యార్థులను నదీ పాయలు దాటి బయటకు పంపవద్దని, ఆయా రేవులను పర్యవేక్షిస్తున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు హెలీనా తెలిపారు.
మూడోసారి వచ్చి.. ముంచి
గోదావరికి గడిచిన రెండు నెలల్లో మూడో సారి వరద వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట చేలు, తోటలు ముంపు బారిన పడుతున్నాయి. దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి పంటలకు నష్టం లేకున్నా అరటి, బొప్పాయి, కంద, పసుపుతో పాటు కూరగాయ పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. జూలైలో ఒకసారి, ఆగస్టులో రెండుసార్లు వరద వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, బొప్పాయి, కూరగాయ పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని అంచనా. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత వరకూ ప్రభుత్వం నుంచి పరిహారంపై ప్రకటన విడుదల కాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగని జలగాటం..

ఆగని జలగాటం..