
ఏలేరులో పెరిగిన నీటినిల్వలు
ఏలేశ్వరం: ఏలేరులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆదివారం ప్రాజెక్టులోకి 1.708 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1.050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 80.74 మీటర్లు, 24.11 టీఎంసీలకు 14.26 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1500, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు.
అన్నదానం, గో సంరక్షణకు
రూ.2.5 లక్షల విరాళం
అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేస్తున్న కర్రి సూర్యనారాయణ (నాని) తన కుమారుడు సత్యగౌరీ ఉదయ్ శర్మకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సత్యదేవుని నిత్యాన్నదాన పధకానికి రూ.లక్ష, గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్‌కు ఆదివారం అందచేశారు. ఏటా ఆషాఢ బహుళ ఏకాదశి నాడు, అన్నదానం, గోపూజ చేయాలని కోరారు.
ఆకట్టుకున్న పురాతన నాణేలు
కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్ వద్ద బోట్‌క్లబ్ ఉద్యానవరంలో గ్రంథాలయం వద్ద వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో వద్దిపర్తి రాజేశ్వరరావు పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను ఆదివారం ప్రదర్శించారు. దేశంలో 18, 19 శతాబ్దాల నాటి వెండి నాణేలు, దమ్మిడీలు, చిల్లు కాసులు, రాగి నాణేలు, అర్ధణాలు, అణాలు, బేడలు, పావలా నాణేలతో పాటు 72 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాణేలు సేకరణ కర్త రాజేశ్వరరావు మాట్లాడుతూ నాణేల సేకరణను అలవాటుగా మార్చికున్నట్టు తెలిపారు. దేశంలో వినియోగించి ప్రస్తుతం వినియోగంలో లేని నాణేల పట్ల నేటి యువతకు అవగాహన కల్పించడం తన ముఖ్య ఉద్దేశమన్నారు. ఎఫ్‌సీఐ మాజీ జీఎం ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలన్నారు.

ఏలేరులో పెరిగిన నీటినిల్వలు