
టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు
● స్వామివారిని దర్శించిన
పది వేల మంది భక్తులు
● రూ.15 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించి పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, ఆదివారం సుమారు పది వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. తరువాత రావిచెట్టు వద్ద ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు