
కెనరా బ్యాంకు కార్యకలాపాల అడ్డగింపు
– గోల్డ్‌లోన్ బాధితుల ధర్నా
తుని రూరల్: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోల్డ్‌లోన్ బాధితులు తేటగుంట కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. శుక్రవారం బాధిత మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో బ్యాంకు గేటు వద్ద షామియానా వేసి ధర్నా నిర్వహించి, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దశాబ్దంగా బ్యాంకులో ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నామని, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను జనవరి నెలలో విడిపించుకునేందుకు రాగా నగలు మాయమయ్యాయన్నారు. దీనిపై నిలదీస్తే ఆభరణాలు తారుమారయ్యాయని, కొన్ని నగలు గోల్‌మాల్ అయినట్టు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్టు బాధితులు తెలిపారు. ఆ తర్వాత అప్రైజర్ మోసం చేశాడని, మేనేజరుతో సహ మరో ఇద్దరిని ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారన్నారు. రుణగ్రస్తులందరికీ బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇస్తానన్న ఆభరణాలు ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి నెలలో ఆందోళన వ్యక్తం చేయగా నెలరోజుల్లో నగలు లేదా నగదు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అప్పటి నుంచి తిరుగుతున్నా తమ ఆభరణాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగలు ఇవ్వకుండానే గోల్డ్‌లోన్‌దారులతో డబ్బు కట్టించుకున్నారు. దీంతో నగలతో పాటు నగదు నష్టపోయామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి బాధితులు బ్యాంకు వద్దే ధర్నా చేయడంతో బ్యాంక్ తలుపులు తెరవలేదు. ఉన్నత అధికారులకు గోల్డ్‌లోన్ బాధితుల ఆందోళన విషయాన్ని తెలియజేసినట్టు సిబ్బంది పేర్కొన్నారు.