పట్టించుకోని వ్యవసాయ శాఖ
ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయ శాఖ వేధింపుల కారణంగా ఎరువుల స్టాకు తెచ్చుకోవడం మానేశామని ప్రైవేటు డీలర్లు బహిరంగంగానే చెబుతున్నారు. అటు ప్రభుత్వం ఎరువులు ఇవ్వక.. ఇటు ప్రైవేటు డీలర్ల వద్ద కూడా దొరక్కపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. పైరు పొట్ట పోసుకొనే దశలో ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ప్రభుత్వానికి, వ్యవసాయ అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
ఎరువుల కోసం నేడు
వైఎస్సార్ సీపీ వినతులు
ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ అధికారులకు వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులు ఇబ్బందులను అధికారులకు తెలియజేయాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు, పార్టీ నాయకులకు ఆయన సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్ సగిలికి దాడిశెట్టి రాజా వినతిపత్రం ఇవ్వనున్నారు.
● జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల
ఎకరాల్లో వరి సాగు
● ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు
● ప్రతి రైతుకూ రెండు మూడు బస్తాల ఎరువులు అవసరం
● వాటి కోసం గంటల తరబడి నిరీక్షణ
● ఇదే అదనుగా కూటమి నాయకుల దందా
● బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా వసూళ్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ‘చంద్రన్న ఉన్నంత వరకూ రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో అన్నారు. ఆ మాటలు నిజమే అన్నట్టుగా ఉంది జిల్లాలోని రైతుల పరిస్థితి. ఖరీఫ్‌లో అన్నదాతకు అదనుకు పెట్టుబడి సాయం అందించని కూటమి సర్కారు.. వారికి కావాల్సిన ఎరువులు సైతం సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో, ఎరువుల కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా సాగేది. అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అందించేవారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిట్లోనే ఎరువులు అందేవి. కూటమి సర్కారు వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. మరో 30 వేలకు పైగా ఎకరాల్లో పొగాకు, మొక్కజొన్న, పత్తి, అపరాలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించడం లేదు. ప్రస్తుతం సహకార సంఘాల్లో ఎరువులు విక్రయిస్తున్నారు. ఒక లోడు వచ్చినా రైతుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదనుకు ఎరువులు లభించకపోవడంతో గత్యంతరం లేక అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి వారికి కావలసినంతగా..
ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ దశలో యూరియా, డీఏపీ, నత్రజని ఎరువులు అవసరం. మూడెకరాలు సాగు చేసే రైతుకు యూరియా 3 బస్తాలు, కాంప్లెక్సు ఎరువులు మూడు బస్తాలు అవసరం. కానీ, ప్రస్తుతం యూరియా, కాంప్లెక్సు ఎరువులు ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు ఆర్‌ఎస్‌కేలు, సహకార సంఘాలకు ఒక లోడు (సుమారు 200 బస్తాలు) ఎరువులు వస్తే.. కూటమి నాయకులు వాలిపోతున్నారు. వచ్చిన ఎరువుల్లో సగానికి పైగా తమకు కావాల్సిన రైతులకే ఇస్తున్నారని, మిగిలిన వారికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామర్లకోట మండలం ఉండూరులో శనివారం ఒక లోడు ఎరువులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన కూటమి నాయకులు వారికి కావాల్సిన వారికి దగ్గరుండి మరీ ఎక్కువ బస్తాలు ఇచ్చి, మిగిలిన వారికి ఒక్కో బస్తా మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తూ అక్కడి రైతులు ఆర్‌ఎస్‌కే వద్ద ధర్నా చేశారు. చాలా మందికి ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రేపు మాపు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ఎరువులను పక్కదారి పట్టించి, ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదే అదనుగా కూటమి నాయకులు ఒక్కో బస్తాను రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా అమ్ముకుంటూ దోచుకుంటున్నారని రైతులు బహిరంగంగానే విమర్శించారు. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఎరువుల కొరత ఎప్పుడూ లేదని, తమను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఎరువులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
గంటలో అయిపోతున్నాయి
ప్రస్తుతం ఎరువుల అవసరం ఎక్కువగా ఉంది. ఎప్పుడో ఒకసారి లోడు ఎరువులు వస్తున్నాయి. అవి గంటలో అయిపోతున్నాయి. ఇక మళ్లీ ఎరువులు రైతు సేవా కేంద్రాలకు రావడం లేదు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. – సుర్ల నాగ రమణ, టీజే నగరం,
కోటనందూరు మండలం
చాలా ఇబ్బందులు పడుతున్నాం
గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. నేను ఐదెకరాలు సాగు చేస్తున్నాను. రెండు బస్తాలు ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– నేతల హరిబాబు, రైతు, సామర్లకోట
ఎరువు.. కరవు
ఎరువు.. కరవు