మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీత | - | Sakshi
Sakshi News home page

మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీత

Aug 6 2025 6:44 AM | Updated on Aug 6 2025 6:44 AM

మహిళా

మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీత

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

కాకినాడ సిటీ: స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచేలా వేడుకలు నిర్వహించాలని, సాంస్కృతిక ప్రదర్శనలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల ఆధ్వర్యాన స్టాల్స్‌, శకటాలను సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలను బుధవారంలోగా పంపించాలని సూచించారు. అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులను మాత్రమే గురువారంలోగా అవార్డులకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పతాకావిష్కరణ జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్‌, జేసీ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు

వేగవంతం చేయాలి

కాకినాడ సిటీ: జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంటు, ఇతర మెటీరియల్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందన్నారు. గృహ నిర్మాణాలపై వారం వారం లక్ష్యం నిర్దేశించుకుని తప్పనిసరిగా స్టేజ్‌ కన్వర్షన్‌ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పోస్టర్‌ అడాప్షన్‌ (తాత్కాలిక దత్తత) కింద రెండు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను దత్తత ఇచ్చే కార్యక్రమం చేపడతారని చెప్పారు. జిల్లాలో సారా, అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు నవోదయం కింద వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పీ4 కార్యక్రమం కింద క్షేత్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని సంపన్నులకు అవగాహన కల్పించి, స్వచ్ఛందంగా దత్తత స్వీకరించేలా చొరవ చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీపీఓ పి.త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీత 1
1/1

మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement