
ఆర్టీసీ స్థలాల ధారాదత్తం దారుణం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కోట్లాది రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను లులు షాపింగ్ మాల్‌కు అప్పనంగా కేటాయించడం దారుణమని ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పులి జార్జిబాబు అన్నారు. కాకినాడలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ స్థలాలను లులు గ్రూపునకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 137 రద్దు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చేపడుతున్న ఉద్యమంలో అన్ని సంఘాలూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున గవర్నర్‌పేట–1, 2 డిపోల వద్ద బస్టాండుకు చెందిన 4.15 ఎకరాల స్థలం సుమారు రూ.400 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ రెండు డిపోల పరిధిలో 200 బస్సులున్నాయన్నారు. ఇటువంటి కీలకమైన స్థలాన్ని 1,100 మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తూ, బడా వ్యాపారులకు ఇవ్వడం దారుణమని విమర్శించారు. 1959లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ స్థలానికి గజం రూ.16 చొప్పున ఆర్టీసీ యాజమాన్యం రూ.4.06 లక్షలు చెల్లించిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సహకరించామని, అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. డీఏలు ఇవ్వలేదని, 12వ పీఆర్‌సీ వేస్తామని, ఐఆర్ ఇస్తామని హామీలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని దుయ్యబట్టారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే, ఈ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ, వారికి ఆర్టీసీ డిపోలను అప్పజెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ బస్సులను కూడా ఆర్టీసీకే ప్రభుత్వం అప్పగించాలని జార్జిబాబు డిమాండ్ చేశారు. యూనియన్ నాయకుడు పి.సత్యానందం మాట్లాడుతూ, దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడటం చాలా బాధాకరమన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఇందేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు ఐ.రవి, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.