
వనదుర్గమ్మకు సరస్వతీదేవిగా పూజలు
అన్నవరం: రత్నగిరి దుర్గామాత వనదుర్గమ్మ శ్రావణ మాస జాతరలో భాగంగా రెండో రోజైన మంగళవారం అమ్మవారిని వీణాపాణి సరస్వతీదేవిగా అలంకరించి, పూజలు చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణ, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణ నిర్వహించారు. మధ్య వయస్కురాలైన ముత్తయిదువను సువాసినిగా, చిన్నారిని బాలగా భావిస్తూ పాద పూజ చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. అనంతరం, అమ్మవారికి నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానంలో పని చేస్తున్న వేద పండితులు కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, పరిచారకుడు వేణు, మరో 44 మంది రుత్విక్కులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వనదుర్గమ్మకు సరస్వతీదేవిగా పూజలు