
‘రంగరాయ’ గ్రౌండ్‌లో.. రాజకీయ క్రీడ
● వైద్య విద్యార్థులకే కేటాయించిన మైదానం
● కూటమి నేతల ఒత్తిళ్లకు
తలొగ్గిన అధికారులు
● ఈ నెల 10 నుంచి వాకర్స్‌కు అనుమతి
● ఆ ముసుగులో వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని ఆందోళన
● విద్యార్థుల భద్రతకు భరోసా కరవు
కాకినాడ క్రైం: చాలా నెలల తరువాత రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) క్రీడా మైదానం గేట్లు ఎట్టకేలకు తెరచుకోనున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఈ మైదానంలో వాకింగ్‌కు, వ్యాయామం చేసుకునేందుకు వాకర్స్‌కు అనుమతులు ఇచ్చారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
గత ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం అప్పటి ఆర్‌ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుత కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు. తాను గౌరవనీయమైన హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిధినని.. అవతలి వ్యక్తి సమాజానికి సేవలందించే వైద్యుడనే కనీస గౌరవం కూడా లేకుండా పిడిగుద్దులు గుద్దుతూ, బూతులు తిట్టారు. విద్యార్థులతో గొడవలకు దిగుతూ, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆయన అనుచరులను డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆర్‌ఎంసీ గ్రౌండ్ నుంచి బయటకు పంపించేయడమే దీనికి కారణం. దాడి చేస్తున్న క్రమంలో అప్పటి వైస్ ప్రిన్సిపాల్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ అడ్డుపడి, ఎమ్మెల్యేను నిలువరించారు. దీంతో, దాడి నుంచి డాక్టర్ ఉమామహేశ్వరరావు బయటపడ్డారు. ఈ విజువల్స్ అప్పట్లో వైరల్ కాగా.. ఈ వివాదం ముఖ్యమంత్రి వరకూ వెళింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కలెక్టర్ షణ్మోహన్, అప్పటి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. దఫదఫాల చర్చల అనంతరం ఎమ్మెల్యే నానాజీకి, డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే, తోటి వైద్యుడికి ఎమ్మెల్యే చేసిన అవమానాన్ని వైద్య సంఘాలు మాత్రం అంత తేలికగా విడిచిపెట్టలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. అప్పటి నుంచీ ఆర్‌ఎంసీ క్రీడా ప్రాంగణంలోకి వైద్య విద్యార్థులను తప్ప మరెవరినీ అనుమతించరాదనే డిమాండ్ తెర మీదికి వచ్చింది. ఒక దశలో ఒత్తిళ్లకు లొంగిన అధికారులు మైదానంలోకి బయటి వారిని కూడా అనుమతించాలని భావించినా అందుకు విద్యార్థులు ఎంత మాత్రమూ అంగీకరించలేదు.
ముక్తకంఠంతో వద్దని..
ఆర్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యాన మొత్తం 2,400 మంది వైద్య విద్యార్థులు దశల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. తమ కళాశాల గ్రౌండ్‌లోనికి ఇతరులను అనుమతించవద్దని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించారు. వాకర్స్ ముసుగులో గంజాయి బ్యాచ్‌లు, అసాంఘిక శక్తులు క్రీడా ప్రాంగణంలోకి ప్రవేశించడం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలాగే, వైద్య బృందాలు కూడా ఏకమయ్యాయి. వివిధ సమావేశాల్లో విద్యార్థులకు తప్ప మరెవ్వరికీ ఆర్‌ఎంసీ క్రీడా మైదానాన్ని కేటాయించరాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో 11 నెలల పాటు విద్యార్థులు తప్ప మరెవ్వరికీ కళాశాల క్రీడా ప్రాంగణంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. తాము వాకర్స్‌కు వ్యతిరేకం కాదనీ, కానీ ఆ ముసుగులో అసాంఘిక మూకలు దురుద్దేశాలతో గ్రౌండ్‌లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులివ్వడం అనివార్యమైతే విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి సమస్యా ఉత్పన్నమవ్వకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆర్‌ఎంసీ క్రీడా మైదానంలోకి వాకర్స్‌ను అనుమతించాలంటూ అధికారులపై కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఈ నెల 10వ తేదీ నుంచి వాకర్స్‌కు అనుమతివ్వాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అయితే, ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకులు మాత్రం విద్యార్థుల భద్రతకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. యాజమాన్యం రిస్క్‌తోనే అనుమతులివ్వాలన్నట్లు మంత్రాంగం నడిపారు. కలెక్టర్ సహా ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ రాజకీయ క్రీడలో చివరకు తమ పంతం నెగ్గించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు చొరవతోనే ఆర్‌ఎంసీ క్రీడా ప్రాంగణం గేట్లు తెరచుకున్నాయని ఆయన అనుచరులంటున్నారు.