
రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం ఆదర్శనీయం
మహా సహస్రావధాని గరికిపాటి నరసింహరావు
కాకినాడ సిటీ: అష్టావధానులకు మార్గదర్శిగా, సాహితీ స్రష్టగా నిలచి, సంస్కృత భాషాసాహిత్యాలకు విశేష సేవలందించిన రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహరావు అన్నారు. బాణుడు సంస్కృతంలో రచించిన కాదంబరి కావ్యంపై ఆయన సాహితీ ప్రసంగం చేశారు. రాణి సుబ్బయ్య దీక్షిత, సాహితీ కౌముది ఆధ్వర్యాన సూర్య కళా మందిరం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కాదంబరి కావ్యంలోని అనేక పాత్రల వ్యక్తిత్వాన్ని గరికిపాటి ఆవిష్కరించారు. కావ్యంలో పరిపాలన చేసే రాజు, నాయికా నాయకులను వర్ణిస్తూ నేటి యువతకు ఆదర్శనీయంగా ఉండేలా ఆయన ప్రసంగం సాగింది. రాణి సుబ్బయ్య దీక్షితులుతో తనకున్న అనుబంధాన్ని గరికిపాటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాదంబరి కావ్యంలోని ఉదాత్త పాత్రలతో సుబ్బయ్య దీక్షితులును సరిపోల్చారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు గరికిపాటి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు రాణి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యాన గరికిపాటి నరసింహరావును సత్కరించారు. ముందుగా సంస్థ నిర్వాహకురాలు గంటి బాలాత్రిపురసుందరి, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి బాబ్జీ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాణి సుబ్బయ్య దీక్షితులు కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, మార్ని జానికిరామ్ చౌదరి, గరికిపాటి మాస్టారు, గౌరినాయుడు, శిరీష, సీఎస్ తదితర సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.