
భద్రత, రవాణా సామర్థ్యంపై దృష్టి సారించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): భద్రత, సరకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) మోహిత్ సోనాకియా అధికారులను ఆదే శించారు. కాకినాడ టౌన్, పోర్టు రైల్వే స్టేషన్లను, సీపోర్ట్, సరకు రవాణా నిర్వహణ, భద్రతా సంసిద్ధత, సిబ్బంది సౌకర్యాలు, కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాలను ఆదివారం ఆయన పరిశీలించారు. రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడంలో బ్యాక్ ఎండ్ జట్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. కాకినాడలోని రన్నింగ్ రూమ్‌ను తనిఖీ చేసి, ఆపరేటింగ్ సిబ్బందికి విశ్రాంతి, రిఫ్రెష్‌మెంట్ సౌకర్యాలను సమీక్షించారు. పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్‌బుక్ వ్యవస్థల్లో సిబ్బంది సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి పని చేసే సిబ్బందిని డీఆర్‌ఎం అభినందించారు.