
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్‌క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్‌క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్‌వీవీఆర్‌కె ప్రసాద్‌బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్‌కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్‌క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్‌లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉప్పాడ తీర ప్రాంత
కోత నివారణకు రక్షణ గోడ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా యేటా సగటున 1.23 మీటర్లు మేర కోతకు గురవుతుండగా, ఒక్క 2017–18 ఏడాదిలోనే 26.3 మీటర్లు కోతకు గురైందన్నారు. ఇది ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి అందజేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను చైన్నెలోని నేషనల్ సెంటర్ ఫర్ పోస్టల్ రీసెర్చ్‌కు పంపించగా రూ.323 కోట్లతో టెట్రాపాడ్‌ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. వీటిని ఆమోదించేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా
రాంప్రసాద్, ఆనంద్
గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.
పెన్షన్ వేలిడేషన్
బిల్లు రద్దు చేయాలి
అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లుతో ఆమోదించిన పెన్షన్ వేలిడేషన్ బిల్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ పెన్షనర్లు అసోసియేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తొలుత పారుపూడి కృష్ణశాస్త్రి ధర్నాను ప్రారంభించారు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి పెన్షనర్స్ సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయడం అమానుషమని, దీనిపై అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి, గుంటూరు సంయుక్తంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు విధి లేని పరిస్థితులలో పోరుబాటను ఎంచుకోవలసి వచ్చిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు అన్నారు. ఈ సవరణ అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పెన్షనర్ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ, పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అమలు చేయాలని కోరారు.

వరుస పురస్కారాలపై హర్షం