
ఈవోలదే సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, అవి పనిచేయకపోతే ఈవోలే పూర్తి బాధ్యత వహించాలని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని దేవదాయశాఖ ఆలయాలు, సత్రాల ఈవోలతో మంగళవారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో దేవుడి వెండి, బంగారం ఆభరణాలకు బీమా చేయించాలన్నారు. ఆలయాలు, సంస్థలకు సంబంధించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమైతే సంబంధిత ఈవోలు వెంటనే నోటీసులు ఇచ్చి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ విళ్ల పళ్లంరాజు, దేవదాయశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ దాసరి భారతి, జిల్లా దేవదాయశాఖాదికారులు కె.నాగేశ్వరరావు, ఈవీ సుబ్బారావు పాల్గొన్నారు.