
ధాన్యం బకాయిలు చెల్లించాలి
కాకినాడ సిటీ: దాళ్వా పంటలో సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మే నెల నుంచి రూ.110 కోట్లు బకాయి పెట్టడంతో జిల్లాలోని రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళనకారులు వివరించారు. ఒక్క తాళ్లరేవు మండలంలోనే 300 మంది రైతులకు రూ.5 కోట్లు, కాజులూరు మండలంలో 400 మందికి రూ.6 కోట్లు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ మొదలైందని, ఇటు పెట్టుబడికి డబ్బులు లేక, అటు పాత బకాయిలు తీర్చలేక నానా ఇక్కట్లూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు కూడా వేయలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు, పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కాజులూరు, ఇంజరం వంతెనలు తక్షణం నిర్మించాలని కోరారు. ఈ సంఘం జిల్లా నాయకులు వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరరావు, దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 556 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే సమగ్రంగా, సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిట్ చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆడిట్ జరుగుతుందని, ఆ సందర్భంగా గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.
సత్యదేవునికి ఘనంగా
జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునితో పాటు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించారు. వెయ్యి వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య
సేవల ధరలు ప్రదర్శించాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు.

ధాన్యం బకాయిలు చెల్లించాలి

ధాన్యం బకాయిలు చెల్లించాలి