
పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
కాకినాడ సిటీ: పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, స్కూల్ ఆయాలకు ఆరు నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యాన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, కాకినాడ రూరల్ ప్రాంతంలో గుడి, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ పేరుతో ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ పని చేసే ఆయాలకు ప్రభుత్వం జనవరి నుంచి వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. మెనూ చార్జీ ప్రతి విద్యార్థికి రూ.20 చెల్లించనిదే వండి పెట్టడం అసాధ్యంగా మారిందన్నారు. వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు అధికమయ్యాయని, తక్షణం వీటిని ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయి ఆందోళనలకు సిద్ధపడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూలు ఆయాలకు పీఎఫ్, ఈఎస్‌ఐ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, మిడ్డే మీల్ సంఘం జిల్లా కార్యదర్శి కరకు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.