
లారీని ఢీకొన్న గూడ్స్ ఆటో
జొన్నాడకు చెందిన డ్రైవర్ మృతి
కిర్లంపూడి: ఆగి ఉన్న లారీని గూడ్స్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్‌గేట్ వద్ద చోటుచేసుకుంది. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీధర్(43) గూడ్స్‌ఆటోలో విశాఖపట్నానికి పువ్వుల లోడుతో కిరాయికి వెళ్లాడు. అక్కడి నుంచి న్యూస్ పేపర్ల లోడును వేసుకుని రాజమండ్రికి తిరిగొస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మరణించాడు. అతడి సోదరుడు సూరిశెట్టి గంగాజలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
గ్రామంలో తీవ్ర విషాదం
ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో సూరిశెట్టి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీధర్ 12 ఏళ్లుగా జొన్నాడలో నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమాని శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఇక తమకు దిక్కెవరంటూ మృతదేహం వద్ద కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు.