
సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
అన్నవరం: పల్నాడు జిల్లా రెంటపాడులో పరామర్శకు వెడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో సత్తెనపల్లి వద్ద ప్రమాదవశాత్తూ కారు కింద పడి మృతిచెందిన సింగయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుక్కపిల్లతో పోల్చడం దారుణమని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. దళితుడిని అవమానించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరుతూ పార్టీ జిల్లా శాఖ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు సరమర్ల మధుబాబు ఆధ్వర్వంలో పార్టీ నాయకులు అన్నవరం పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జగన్ కాన్వాయ్‌లో కారు సింగయ్యను ఢీకొట్టలేదని వేరే కారు ఢీ కొట్టిందని మొదట ప్రకటించిన జిల్లా ఎస్‌పీ నాలుగు రోజుల తరువాత ఢీ కొట్టిందని చెప్పడం వెనుక కుట్ర దాగుందన్నారు. తన భర్త మృతి వెనుక కుట్ర ఉందని సింగయ్య భార్య లూర్తు మేరీ పేర్కొన్నారని తెలిపారు. దీనిని కప్పిపుచ్చడానికి సింగయ్యను కుక్కపిల్లలా పక్కన పడేశారని సీఎం అనడం దళితులను అవమానించడమే అన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని వారు హెచ్‌సీ ప్రభాకరావుకు ఫిర్యాదు అందజేశారు. ఆశిన శ్రీనివాస్, ఎస్.రాము పాల్గొన్నారు.