
జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలి
కాకినాడ సిటీ: దేశంలోని 14 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలవుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం లేదని ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ యూటీఎఫ్ హోంలో ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పలు సమస్యలపై సమాచార శాఖ మంత్రిని కలిసి సుదీర్ఘంగా చర్చించామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సచివాలయంలో జర్నలిస్టు సంఘాల అన్నింటితో ఒక సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ప్రస్తుత ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించే ప్రయత్నంపై కసరత్తు చేస్తోందని మంత్రి వివరించినట్లు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్‌రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా తదితరులు పాల్గొన్నారు.