
బాబు మోసాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
– వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ఏడాది కాలంగా చేసిన మోసాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ శుక్రవారం జరిగిన సమావేశంలో రాజా మాట్లాడుతూ పార్టీ నేతలు సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలన్నారు. అధికార పార్టీ వేధింపులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎవరూ బెదిరిపోరన్నారు. ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్ సీపీ వెన్నంటే ఉన్నారన్నారు. అక్రమంగా కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదే లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమానికి ఎక్కడా లోటులేకుండా దేశంలో ముందుకు తీసుకువెళ్లిన ఏకై క ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇటీవల నియమితులైన పార్టీ జిల్లా, అనుబంధ కమిటీల ప్రతినిధులను రాజా, ద్వారంపూడి సత్కరించారు. రాజాను ద్వారంపూడి ఆధ్వర్యంలో పార్టీ సిటీ నేతలు సత్కరించారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీిప్తి, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్(బన్నీ), పార్టీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, సిటీ యువజన విభాగం అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.