
పీపీపీ విధానంతో ఎంబీబీఎస్‌కు దూరం
కాకినాడ రూరల్: వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పాట పాడడంతో కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్‌లోని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను 100 శాతం ప్రభుత్వపరంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పడు దానిని విస్మరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు దోచి పెట్టేందుకు పీపీపీ విధానం తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫలితంగా వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ కలగా మారుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ ప్రభుత్వ సంస్థలను తమ వారికి కారు చౌకగా అమ్మేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. ఈ కుట్రలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు భాగస్వాములని, 50 ఎకరాల భూమిని కేవలం రూ.5వేలకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో పలు వైద్య కళాశాలల్లో 750 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా వాటిని రద్దు చేయమని నేషనల్ మెడికల్ కమిషన్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమకు మెడికల్ సీట్లు కేటాయించాలని కోరుతుందని, కానీ ఏపీలో మాత్రం సీట్లను రద్దు చేయాలని కోరడం సిగ్గు చేటు అన్నారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కుతంత్రాలకు తక్షణం స్వస్తి పలకాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, రాష్ట్ర కార్యదర్శి కరణం భాను నాయుడు, సూరిబాబు పాల్గొన్నారు.