
రికార్డు స్థాయిలో..
ఫ సత్యదేవుని ప్రసాదాలకు క్యూ కట్టిన
లోవ భక్తులు
ఫ సుమారు 75 వేల ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు
ఫ అన్నవరం దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం
అన్నవరం: ఊహించినట్టుగానే ఆషాఢ మాసం తొలి ఆదివారం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాల విక్రయాలు రికార్డు స్ధాయిలో జరిగాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ఉదయం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తలుపులమ్మ లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు వెళ్తూంటారు. వారు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పునరావృతమైంది.
80 వేల ప్యాకెట్లు సిద్ధం
లోవ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్నవరం దేవస్థానం అధికారులు 80 వేల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేశారు. రత్నగిరిపై ప్రసాదం కౌంటర్లలో 25 వేలు, తొలి పావంచా వద్ద కౌంటర్లలో 20 వేలు, పాత నమూనా ఆలయం వద్ద 25 వేలు, కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్‌ను రూ.20 చొప్పున సుమారు 75 వేల ప్యాకెట్లు విక్రయించారు. భక్తులు భారీగా బారులు తీరి మరీ ప్రసాదాలు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకూ రద్దీ కొనసాగింది. లోవ భక్తుల తాకిడిని తట్టుకునేందుకు గాను తొలి పావంచా వద్ద అదనంగా మరో రెండు, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద కూడా మూడు కౌంటర్ల చొప్పున ప్రసాదం విక్రయ కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రచారం లేక..
జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే మార్గంలో ఉన్న సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద కూడా ఏడాది కాలంగా ప్రసాదాలు విక్రయిస్తున్నారు. అయితే, దీనిపై తగినంత ప్రచారం లేకపోవడంతో లోవ భక్తుల వాహనాలు ఇక్కడ పెద్దగా ఆగడం లేదు. విశాఖపట్నం వైపు మార్గంలోని పాత నమూనా ఆలయం వద్దనే భక్తులు తమ వాహనాలను నిలిపి, రోడ్డు దాటుకుని వచ్చి, ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం వైపు మార్గంలో కూడా సత్యదేవుని నమూనా ఆలయం, ప్రసాదాల కౌంటర్ నిర్మించింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించి, టాయిలెట్లు కూడా నిర్మించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధీ చేయలేదు. వాటర్ బాటిల్స్, శీతల పానీయాలు, స్నాక్స్ విక్రయించే షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఇక్కడ భక్తులు పెద్దగా ఆగడం లేదు. ఎక్కువ మంది పాత నమూనా ఆలయం వద్దనే ఆగుతున్నారు. అక్కడ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 షాపులు, హోటల్స్ ఉండడంతో లోవ భక్తులు తిరుగు ప్రయాణంలో అక్కడి నమూనా ఆలయం వద్దనే ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఆదివారం సుమారు 25 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. నూతన నమూనా ఆలయం వద్ద అధికారులు తగిన వసతులు కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.

రికార్డు స్థాయిలో..