
కార్పొరేట్ల కోసమే ‘ఏపీ విజన్–2047’
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్–2047 డాక్యుమెంట్ కార్పొరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డాక్టర్ వి.గంగారావు అన్నారు. శ్రీవిజన్–2047.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిశ్రీ అనే అంశంపై రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన కాకినాడ యూటీఎఫ్ హోమ్‌లో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయంలో కార్పొరేట్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ఏపీ విజన్ డాక్యుమెంట్‌లో ఉందన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం ఉండదని, ప్రైవేటు రంగంలో కూడా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేదని చెప్పారు. కార్పొరేట్ తరహా అభివృద్ధి అంటే సంపద ఒకేచోట పోగు పడుతుందని అన్నారు. దీనివలన సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు 1999లో కూడా విజన్–2020 డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు. అది ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మెకన్సీ కంపెనీ తయారు చేసిందన్నారు. తాజా డాక్యుమెంట్‌ను కూడా అధికారులు తయారు చేయలేదని విమర్శించారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలను మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని గంగారావు చెప్పారు. విశ్రాంత చీఫ్ ప్లానింగ్ అధికారి వి.మహిపాల్ మాట్లాడుతూ, ఏదైనా విజన్ డాక్యుమెంట్ విడుదల చేసే ముందు క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగాలని, అనంతరం వివిధ వేదికలపై చర్చలు జరగాలని, ప్రాధాన్యాలు నిర్ణయించుకుని, అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని వివరించారు. ప్రస్తుత డాక్యుమెంట్ ప్రజారోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వీవీ రమణ, స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరిపై ఆదివారం భక్తులు సందడి చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారికి ఆలయం లోపలి ప్రాకారంలో పల్లకీ సేవ నిర్వహించారు.