
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన కె.వెంకటేశ్వరరావు (పేరు మార్చాం) కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కాకినాడ రూరల్ వాకలపూడిలో చిన్న పెంకుటింట్లో నివాసం. భార్యాభర్తలిద్దరూ పనిలోకి వెళ్తే తప్ప కుటుంబం గడవదు. వారికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. ఇరుగుపొరుగు కుటుంబాల వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. అది చూసిన వెంకటేశ్వరరావు దంపతులు కూడా తమ కుమారుడిని ఏదో ఒక ప్రైవేటు ప్లే స్కూల్‌లో జాయిన్ చేద్దామని ఆశ పడ్డారు. రెండు మూడు స్కూళ్లకు వెళ్లారు. అన్ని రకాల ఫీజులూ కలిపి రూ.25 వేలు పైనే చెప్పారు. అదే ఎల్‌కేజీ రూ.45 వేలు, యూకేజీ రూ.65 వేలు చెప్పడంతో వారు కంగు తిన్నారు. ఏటా అన్ని వేల రూపాయల ఫీజులతో వేగలేమంటూ మరో మాట మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేశారు.
ఒక్క వెంకటేశ్వరరావు కుటుంబమే కాదు.. జిల్లాలో ఏ తల్లిదండ్రులను కదిపినా ఠారెత్తిస్తున్న ఫీజులతో గుండెలు పీచుపీచుమంటున్నాయనే అంటున్నారు. కూటమి సర్కారు ఏలుబడిలో విద్యా వ్యవస్థలో కార్పొరేట్ పెత్తనం పెరిగిపోవడంతో ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. దీంతో, పిల్లల చదువులు సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారాయి.
కానరాని తనిఖీలు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ పరంగా ఎటువంటి తనిఖీలూ జరగడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంఈఓ పర్యవేక్షణలో ఆయా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు ఆడించడం విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది. దీనికోసం వ్యాయామోపాధ్యాయులతో పాటు ఆటస్థలం కూడా పాఠశాలల్లో ఉండాలి. కానీ, ప్రైవేటు పాఠశాలల్లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పైగా, నాలుగైదు అంతస్తులతో ఉన్న భవనాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వ హయాంలో..
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండేది. అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు కూడా చేసేవారు. దీంతో, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్లో కొంత నియంత్రణ కనిపించేందని చెబుతున్నారు. అప్పట్లో ప్లే స్కూల్ నుంచి టెన్త్ వరకూ ఫీజు రూ.12 వేలు మాత్రమే ఉండేది. పట్టణ ప్రాంతాల్లో అదనంగా రూ.వెయ్యి వసూలు చేసేవారు. కార్పొరేషన్లలోని పాఠశాలల్లో రూ.18 వేల వరకూ అనుమతించేవారు. అటువంటిది నేడు దీనికి పూర్తి భిన్నంగా ప్లే స్కూల్ నుంచే విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీ‘జులుం’ సాగిస్తున్నారు. ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
వారి ఆశలే.. వీరికి కాసులు
సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమకంటే తమ పిల్లలు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. సర్కారీ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వమే చిన్నచూపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో.. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తున్నారు. వేలకు వేలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ఆయా విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా పలు ప్రైవేటు విద్యా సంస్థలు రకరకాల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నాయి.
● ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాలనే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉపయోగించాలి. కానీ, పలు యాజమాన్యాలు సొంత కంటెంట్‌తో తయారు చేసిన పుస్తకాలనే విక్రయిస్తున్నా విద్యా శాఖ చూసీ చూడనట్లు వదిలేస్తోందనే విమర్శలున్నాయి.
● యూనిఫామ్ దగ్గర నుంచి పుస్తకాలు, ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు ఇలా ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా రెండో మాట లేకుండా సమర్పించుకోవాల్సిందే.
● కొన్ని విద్యా సంస్థలు తాము చెప్పిన షాపులోనే యూనిఫాం, బెల్టులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ వంటివన్నీ కొనాలని షరతులు పెడుతున్నాయి. దీనిని కాదంటే ఏమవుతోందోననే బెంగ తల్లిదండ్రులను వేధింస్తోంది.
భారం మోయలేక..
ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తూంటంతో ఆ భా రం మోయలేని పలువురు తల్లిదండ్రులు పదో తరగతి వచ్చేసరికి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి మా న్పించేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో రెండో తరగతిలో 13,261 మంది విద్యార్థులుంటే పదో తరగతి వచ్చేసరికి ఆ సంఖ్య 8,590కి పడిపోయింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్లే స్కూల్‌కే రూ.25 వేలు పైగా వసూలు
రకరకాల పేర్లతో భారీగా వసూళ్లు
పుస్తకాల నుంచి సాక్స్ వరకూ
అంతా వ్యాపారమే..
దోపిడీపై నోరెత్తని ప్రభుత్వం
‘ప్రైవేటు’ దెబ్బకు తల్లిదండ్రుల గుండె గుభేల్
ఫీజులు నియంత్రించాలి
జిల్లావ్యాప్తంగా ప్రైవేటు,
కార్పొరేట్ విద్యా సంస్థలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తున్నాయి. అటువంటి వాటిపై
చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు
విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు
నిర్వహించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతోంది. కానీ, ప్రైవేటు,
కార్పొరేట్ సంస్థలు దీనిని పట్టించుకోవడం లేదు. అధిక మొత్తంలో
పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్ముతున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ
కఠిన చర్యలు
అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై విద్యార్థుల తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. ఫీజులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే వసూలు చేయాలి. దీనిపై విద్యా శాఖ నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటాం.
– పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
ఫీజుల మోత మోగుతోందిలా..
ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి మూడో త రగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.49,000, రెండో టర్మ్ రూ.46,900, లైబ్రరీ ఫీజు రూ.3,000 చొప్పున వసూలు చేస్తున్నారు.
నాలుగు నుంచి ఆరో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.51 వేలు, రెండో టర్మ్ ఫీజు రూ.49,900, లైబ్రరీ ఫీజు రూ.4,000.
ఏడు నుంచి పదో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.53,000, రెండో టర్మ్ రూ.50,900, లైబ్రరీ ఫీజు రూ.4,000.
ఇవి కాకుండా బస్సు, ఆటో వంటి వాటికి రవాణా ఫీజుగా రూ.33,000, అడ్మిషన్ ీఫీజు రూ.15,000 వసూలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం బస్సు ఫీజు కిలో మీటరుకు రూ.1.30 వసూలు చేయాలి. కానీ, ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా దూరాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలు పైగా వసూలు చేస్తున్నాయి.
అలాగే, మొదటి 30 రోజుల్లో ఆలస్యంగా వస్తే రూ.50, తరువాత నుంచి సమయానికి హాజరు కాకుంటే రోజుకు రూ.100 చొప్పున చెల్లించాలి.
ప్రతి విద్యా సంవత్సరానికి 10 నుంచి 15 శాతం మేర ఫీజులు పెంచుతున్నారు.
గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫీజుల భారం 20 శాతం పెరిగిందని చెబుతున్నారు.
ఇది చాలదన్నట్టు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఖర్చు అదనం.
తరగతి విద్యార్థులు
1 11,757
2 13,261
3 13,717
4 13,142
5 12,761
తరగతి విద్యార్థులు
6 10,755
7 9,590
8 8,746
9 8,818
10 8,590
మొత్తం 1,11,137

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థు

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థు

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థు