
దున్నపోతుతో తొక్కించుకోడానికి ఉపవాసాలు ఉండి నేలపై పడుకున్న భక్తులు
● గ్రామ దేవతల ఉత్సవాలు ప్రారంభం
● వైవిధ్య ఆచారాలకు ఈ వేడుకులు
పెట్టింది పేరు
● తీర ప్రాంత గ్రామాల్లో రెట్టించిన ఉత్సాహం
పిఠాపురం: మార్చి వచ్చిందంటే అమ్మ వారి వేడుకలు మొదలవుతాయి. ఉగాది ముందు రోజును కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు. ఈరోజున ఎక్కువ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కొన్ని గ్రామాల్లో అమావాస్యకు ముందే ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆచారాలు కఠినంగా ఉన్నా తప్పకుండా అనుసరిస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు. ఏటా ఒకసారి నిర్వహించే జాతర కోసం చిన్నాపెద్దా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వివిధ విచిత్ర సంప్రదాయాలు కనిపించే అమ్మవారి ఉత్సవాలు జిల్లాలో ప్రస్తుతం జోరందుకున్నాయి.
తీరంలో వైవిద్యభరితంగా ఆలయాలు
తీర ప్రాంత గ్రామాల్లో ఆలయాలు, దేవతల విగ్రహాలు ఆసక్తి కలిగిస్తాయి. ఆలయాలుంటాయి గాని నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉండవు. కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. ఆలయాలకు తలుపులు, చుట్టూ ప్రహరీలు ఉంటాయి. సాధారణంగా ఏ విగ్రహానికై నా రూపురేఖలు ఉంటాయి. ఇక్కడ అవేమి కనిపించవు. మత్స్యకారులు మనసులోనే అమ్మను తలచుకుంటూ జీవనోపాధికి వెళుతుంటారు. తీరంలో అమ్మవారి జాతర్ల తీరు వైవిధ్యంగా జరుగుతాయి. ఆచారాలు కట్టుబాట్లు విస్మయం కనిపిస్తాయి. సాధారణంగా మత్స్యకారులు అమ్మవార్లను నేరేళ్లమ్మ, భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి పేర్లతో పిలుచుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ముత్యాలమ్మ, నక్కుళ్లమ్మ, సత్తెమ్మ, బోడ కొండమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, మావుళ్లమ్మ తదితర పేర్లతో పిలుస్తుంటారు.
దుష్టశక్తులు రాకుండా కర్రలతో కాపలా..
ఉప్పాడ శివారు కొత్తపట్నంలో గ్రామ దేవత నేరేళ్లమ్మ జాతర ఇతర గ్రామాల్లో వేడుకలకు ప్రారంభ సూచకంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారి జాతర నిర్వహించాకే ఇతర గ్రామాల్లో అమ్మవార్ల జాతరలు జరుపుతారు. ఈ జాతరలో అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయాన ఊళ్లో యువకులందరూ కర్రలతో కాపలా కాస్తారు. దుష్ట శక్తులు రాకుండా కర్రలతో కొడుతూ నైవేద్యం సమర్పించడం పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారం. అమీనాబాదలో పోలేరమ్మ జాతరలో దున్న పోతును జాతరకు కొన్ని నెలల ముందు నుంచి పెంచుతారు. దానికి ప్రత్యేక పూజల చేస్తారు. జాతర రోజు భక్తుల దానితో తొక్కించుకుంటారు.ఇలా పలు ఆచారాలు ఆసక్తి కలిగిస్తాయి.
ఏడాదిలో ఒకటే పండుగ
ఏడాదికి ఒకసారి అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహిస్తాం. కఠినమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉంటాం. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాం. అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు జరుపుతాం. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరిస్తాం.
– వనమాడి జగన్నాథం, కొత్తపట్నం, ఉప్పాడ
చాన్నాళ్లుగా వస్తున్న ఆచారం
తాతల కాలం నుంచి గ్రామ దేవత పండగలో దున్నపోతుతో తొక్కించుకోవడం ఆచారంగా వస్తోంది. చాలా నిష్టగా చేస్తాం. గ్రామంలో అమ్మోరులుగా కొందరు మహిళలు ఉంటారు. మా వాళ్లంతా తమ మీద దున్న పోతును నడిపించుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో దోషాలు పోతాయని మా విశ్వాసం.
నక్కా మణికంఠ,(చినబాబు) సర్పంచ్,
అమీనాబాద్, కొత్తపల్లి మండలం

తీర ప్రాంతంలో విచిత్రంగా ఉండే మత్స్యకారుల దేవతల ఆలయాలు


