
ప్రమాదానికి కారణమైన పే లోడర్‌ను పరిశీలిస్తున్న అధికారులు
● పే లోడర్ డ్రైవర్ దుర్మరణం
● ప్యారీ షుగర్స్ వద్ద ప్రమాదం
కాకినాడ రూరల్: వాకలపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని ప్యారీ షుగర్స్ పరిశ్రమ వద్ద సోమవారం పే లోడర్ వాహనం టైరు పేలి డ్రైవర్ పెనుబోతు శివకుమార్ (32) దుర్మరణం పాలయ్యాడు. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ తూరంగి మహాలక్ష్మి నగర్‌కు చెందిన శివకుమార్ ప్యారీ షుగర్స్‌లో ఐదేళ్లుగా పే లోడర్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో గాలి పెడుతూండగా పే లోడర్ టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దాని డ్రమ్ము తలపై బలంగా తగలడంతో శివకుమా ర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రమ్ము తగిలిన వేగానికి అతడి మెదడు బయటకు వచ్చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన యాజమాన్యం శివకుమార్‌ను అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శివకుమార్‌కు ఏడాది కిందట వివాహమైంది. భార్య భవాని, 11 నెలల బాబు ఉన్నా రు. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఊహించని ప్రమాదం జరగడంతో ఆమె కుంగిపోయింది. తన భర్త చనిపోయాడనే చేదు నిజం జీర్ణించుకోలేక వెక్కివెక్కి రోదించింది.
కార్మికుల ఆందోళన : గతంలో ప్యారీ షుగర్స్‌లో వరుసగా జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదం జరిగిందనే సమాచారంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. శివకుమార్ మృతి వార్త తెలియడంతో కార్మిక నాయకులు, మృతుడి భార్య భవాని, కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ, తూరంగి మహాలక్ష్మి నగర్ నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, రూరల్, టూ టౌన్ సీఐలతో పాటు ఇతర పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులను గేటు లోపలకు అనుమతించలేదు.
స్పందించిన యాజమాన్యం : ఆందోళన నేపథ్యంలో ప్యారీ షుగర్స్ యాజమాన్యం స్పందించింది. పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన చర్చల్లో మృతుని భార్య భవానీకి ఉద్యోగం ఇవ్వడానికి, యాజమాన్యం నుంచి రూ.40 లక్షలు, మట్టి ఖర్చులకు మరో రూ.లక్ష, వర్క్‌మన్ కాంపన్సేషన్ కింద రూ.10 లక్షలు, పే లోడర్ కాంట్రాక్టర్ రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.56 లక్షల వరకూ అందించేందుకు అంగీకారం కుదిరింది. ప్రమాద స్థలాన్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ పరిశీలించారు. టైరుకు ఎక్కువ గాలి పెట్టడం వలన, అది పేలి, డ్రమ్ వద్ద ఐరన్ హోరింగ్ తగిలి శివకుమార్ మృతి చెందాడని తెలిపారు. ప్రమాదంపై సర్పవరం ఎస్సై సతీష్‌బాబు కేసు నమోదు చేశారు. మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

మృతుడు శివకుమార్ (పాత చిత్రం)