గద్వాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న మైనారిటీస్ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియాలో వెల్డర్, స్ప్రే పేయింటర్, ప్యానెల్ బీటర్, కారు మెకానిక్ వంటి ఉద్యోగాలతోపాటు ఓమన్‌లో డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ అండ్ డెలివరీ చీఫ్ ప్రాజెక్టు అండ్ టెక్నికల్ ఆఫీసర్ క్లోత్ క్లీనర్, అగ్రికల్చర్ ఇంజినీర్, కొబ్బరి కోత కార్మికులు, కాంక్రీట్ 3డీ ప్రింటర్ ఆపరేటర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే జర్మనీలో రిజిష్టర్డ్ జనరల్ నర్స్, ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఖతర్‌లో రిజిష్టర్డ్ నర్స్ (పురుషులు, మహిళలు) హౌస్‌కీపింగ్ వెయిటర్స్, కుక్స్, హోటల్ రిసెప్షనిస్ట్ (మహిళలు), గ్రీస్‌లో స్పాథెరపిస్ట్ (మహిళలు), ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్, ప్లంబర్, లైఫ్ గార్డ్స్, గార్డెనర్స్, క్లీనర్స్, డెలివరీ బాయ్స్, ఫిషర్‌మెన్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత గల మైనార్టీ అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లోని రూం నం.8 మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
7న మెగా జాబ్‌మేళా
గద్వాల: జిల్లాలో నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కాలేజీలో నిర్వహించే మేళాకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు.
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాల: ప్రపంచంలో అత్యంత సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో సరళ యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సోమవారం ప్రతిబూత్ పరిధిలో 5 మంది చొప్పున జెండా ఎగరవేయాలన్నారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని 13న సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీసి.. 14న ఉదయం పూలమాలతో అలంకరించి నివాళులర్పించి.. అంబేడ్కర్ జీవితం గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంరావు, జయశ్రీ, దాస్, అనిల్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, కృష్ణ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
గొల్లపల్లి రిజర్వాయర్
ప్రతిపాదన వ్యర్థం
వనపర్తి: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థమని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని 97 రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్‌రావు వస్తున్నారని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పర్యటనతో బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం అన్నారు.


