గద్వాల: జిల్లాలో జనగణన ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రణాళిక గణాంక అధికారులు చార్జ్ క్లర్క్, అసిస్టెంట్ చార్జ్ క్లర్క్‌లుగా, కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక సహాయకులుగా తమకు నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ తరగతులు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి కాలనీ, అపార్టుమెంట్లు, చిన్నచిన్న వీధి ప్రాంతాల్లో నివసించే ప్రతి ఇంటిని, ఇంట్లోని ప్రతిఒక్కరి గణన విధిగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. వందశాతం కచ్చితత్వంతో పూర్తి చేయడమే తమ లక్ష్యంతో జనగణన చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లా స్థాయి వరకు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేలా కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, సీపీఓ పాపయ్య, డీపీఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 81 ఫిర్యాదులు..
ప్రజావాణిలో ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటానని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి 81 ఫిర్యాదులు రాగా.. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొటూ ఫిర్యాదుదారునికి సమాచారం పంపాలన్నారు. ప్రస్తుతం ప్రజావాణిలో ఇప్పటి వరకు అధిక దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రెవెన్యూ, పురపాలక శాఖల పరిధిలోనే అధికంగా ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లా చాలా రంగాల్లో వెనకబడి ఉందని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీ ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


