‘హామీలన్నీ గాలికొదిలేశారు’ | - | Sakshi
Sakshi News home page

‘హామీలన్నీ గాలికొదిలేశారు’

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

గద్వాల: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా ఆశాలపై పోలీసుల లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లాకేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఆశాలతో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇస్తానని హామీ ఇచ్చి విస్మరించారని, దీనిపై ప్రశ్నిస్తే ఆశాలపై అత్యంత పాశవికంగా వ్యవహరించి లాఠీలు ఝులిపించిందని విమర్శించారు. లాఠీచార్జి చేయడమే కాకుండా మహిళలు అనే కనీస స్పృహ లేకుండా రాత్రి వరకు పోలీసుస్టేషన్లలో నిర్బంధించడం దారుణమని మండిపడ్డారు. అదేవిధంగా చాలామందిని ఇళ్ల వద్దనే అక్రమంగా అరెస్టు చేసి ఠాణాల్లో పెట్టారని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేలు ఇవ్వాలని, అదనపు పనిభారాన్ని తగ్గించాలని, మృతిచెందిన వారికి అంత్యక్రియలకు రూ.50 వేలు, అదేవిధంగా బీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వీటిని అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సీఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి రాస్తారోకో చేస్తున్న వారిని అడ్డుకుని పక్కకు పంపించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌కు అందించారు. కార్యక్రమంలో నర్సింగమ్మ, నాగప్రమీల, శ్వేత, జయలక్ష్మి, సునీత, కాంతమ్మ, కవిత, పద్మ, శ్రీదేవి తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement