● జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,345 కేసులు పరిష్కరం
● హైకోర్టు న్యాయమూర్తులు శ్యాంకోశీ,
శ్రావణ్‌కుమార్ వెల్లడి
గద్వాల క్రైం: లోక్ అదాలత్‌లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శ్యాంకోశీ, శ్రావణ్‌కుమార్ అన్నారు. కేసులు వద్దు.. సామరస్య పరిష్కారమే ముద్దు అని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం ఉండదన్నారు. సాంకేతిక విప్లవంలోనూ కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులు తమ విలువైన భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి దిశగా ముందుకు రావాలన్నారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి రవికుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో 5,345 కేసులు పరిష్కారమైనట్లు వెల్లడించారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులలో ఇరువర్గాల వారిని రాజీ కుదుర్చినట్లు వివరించారు. అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తులకు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. నూతన కోర్టు నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టిందని హైకోర్టు నాయ్యమూర్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, మెంబర్ పంచాక్షరి, టి.లక్ష్మి, శ్రీనివాస్, వెంకట హైమ పూజిత, ఉదయ్‌నాయక్, ఏపీపీలు సంజనా జాషువా, వినోదాచారి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


