సంతకు
అంతర్జాతీయ గుర్తింపు
విమర్శలతోనే సరి
అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం
● ఏళ్లుగా నలుగుతున్న
పెబ్బేరు సంత వివాదం
● రూ.కోట్ల ఆదాయం
కోల్పోతున్న మున్సిపాలిటీ
● మీడియా వేదికగా
ఆరోపణలు, ప్రత్యారోపణలు
● అయోమయంలో ప్రజానీకం
వనపర్తి: దక్షిణ తెలంగాణలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పెబ్బేరు సంత అంశం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ప్రధాన పార్టీల మధ్య ప్రచార అస్త్రంగా మారింది. సంతస్థలంపై విమర్శలు, హామీలు ఎన్నికలను ప్రభావితం చేసినట్లుగా ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు సంత స్థలం వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదంటూ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీస్తుండగా.. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి..
పెబ్బేరు సంత విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కేబినేట్‌లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెప్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా నేతల మధ్య విమర్శలు తప్పా పరిష్కారం వైపు కనీసం ఒక్క అడుగు పడలేదనే ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ఇటీవల స్పందించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రిపై ఘాటు విమర్శలే చేశారు. దీనికి ఇంతవరకు మాజీ మంత్రి స్పందించకున్నా.. బీఆర్‌ఎస్ నాయకులు మీడియాలో మరోసారి ఆరోపణలు గుప్పించడం స్థానికులను అయోమయంలో పడేసేలా చేస్తోంది.
పెబ్బేరు సంత
జాతీయ రహదారి 44పై పెబ్బేరు సంతను నిర్వహిస్తుండటంతో ఇక్కడి సంతకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువుల విక్రయదారులు ఇక్కడికి వస్తుంటారు. కూరగాయల నుంచి గృహ నిర్మాణం, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్లు ఇక్కడ సంత రోజుల్లో విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద ఎత్తున పశువులు, గొర్రెలు, మేకల విక్రయాలు జరుగుతాయి. ప్రతి అమ్మకం, కొనుగోలుపై వచ్చే ఆదాయం పెబ్బేరు మున్సిపాలిటీకి చేరాల్సి ఉండగా.. గత కొన్నేళ్లుగా సంత అనధికారికంగా నిర్వహిస్తుండతో ఆదాయం ఎవరి చేతికి వెళ్తుందనే అంశాన్ని పాలకులు, నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్‌ను ఎప్పుడు, ఎవ్వరు ప్రశ్నించిన త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామనే మాటచెప్పటం పరిపాటిగా మారింది. ఆ దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం ఇప్పటి వరకు ఎలాంచి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.
రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటన్నారే తప్పా.. ఈ వివాదం కారణంగా సంత నిర్వహణ కోసం టెండర్ నిర్వహించకపోవడంతో ఏటా మున్సిపాలిటీకి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతుందనే విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.12 కోట్లకుపైగా ఆదాయం మున్సిపాలిటీ కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.


