గద్వాల: జనగణన–2027 ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు దశల్లో నిర్వహించే జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మే 11 నుంచి మొదటి దశలో ప్రారంభమయ్యే ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్, హౌస్ ఎన్యూమరేషన్) గణన జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రెండవ దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈసారి జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 33 ప్రశ్నల వివరాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించాలన్నారు. జనగణనలో ఏ ఒక్కరిని కూడా వదలకుండా సమగ్ర వివరాలను నమోదు చేయాలన్నారు. మండల, మున్సిపల్ స్థాయిలో అధికారులకు సహాయం అందించేందుకు చార్జీ క్లర్క్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చార్జీ క్లర్క్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టరేట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ సుల్తాన్‌అలీ, జాయింట్ డైరెక్టర్ లాగర్, సీపీఓ పాపయ్య పాల్గొన్నారు.


